BRAMHAMGARI MATAM: హైకోర్టులో బ్రహ్మంగారిమఠం వివాదం.. విచారణ వాయిదా!

కడపజిల్లా బ్రహ్మంగారిమఠానికి సంబంధించి వివాదం ఇంకా ముగియలేదు. మఠాధిపతి ఎంపిక విషయంలో సమస్య సద్దుమనిగింది అనుకునేలోపే మరో మలుపు తిరుగుతూనే ఉంది.

BRAMHAMGARI MATAM: హైకోర్టులో బ్రహ్మంగారిమఠం వివాదం.. విచారణ వాయిదా!

High Court

BRAMHAMGARI MATAM: కడపజిల్లా బ్రహ్మంగారిమఠానికి సంబంధించి వివాదం ఇంకా ముగియలేదు. మఠాధిపతి ఎంపిక విషయంలో సమస్య సద్దుమనిగింది అనుకునేలోపే మరో మలుపు తిరుగుతూనే ఉంది. లేటెస్ట్‌గా బ్రహంగారి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయశాఖను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు మరణించిన మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి.

మఠాధిపతిగా వెంకటాద్రి స్వామికి లైన్ క్లియర్ అయ్యింది అనుకున్న సమయంలోనే, మఠాదిపది వ్యవహారం మొత్తం మళ్లీ కోర్టు పరిధిలోకి వెళ్లింది. శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2018 నవంబర్ 10న వీలునామా రాశారని, తన తరువాత రెండో భార్య కుమారుడు గోవిందస్వామికి శాశ్వత పీఠాధిపతిగా నియమించాలని అందులో ఉందంటూ మహాలక్ష్మి పిటిషన్‌లో వెల్లడించారు. తమను మఠానికి తదుపరి వారసులుగా నామినేట్ చేస్తున్నట్లుగా 2010 అక్టోబర్ 1వ తేదీనే వసంత వేంకటేశ్వరస్వామి, ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్‌కు తెలియజేశారనీ పిటిషన్‌లో పేర్కొన్నారు.

పెద్దకొడుకే మఠాధిపతిగా కొనసాగాలనే సంప్రదాయం లేదంటూ.. ఈమేరకు వీలునామానూ పిటిషన్‌కు జతచేశారు. అంతకుముందే దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లె శ్రీనివాస్‌కు మహాలక్ష్మి లేఖ రాశారు. వెంకటాద్రి స్వామి నియామకానికి తనను బలవంతగా ఒప్పించారని, ఒత్తిడితోనే అగ్రిమెంటుపై సంతకం చేసినట్లు లేఖలో వెల్లడించారు. వెంకటాద్రిస్వామి నియామకం రద్దు చేసి తమకు న్యాయం చేయాలని మహాలక్ష్మి కోరారు.

దీనిపై హైకోర్టులో ఇవాళ(01 జులై 2021) విచారణ జరగగా.. మఠానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు పిటీషనర్ తరపు న్యాయవాది. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకోవాలని పిటీషనర్ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిడ్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.