Ukraine : యుక్రెయిన్‌లో 4వేల మంది తెలుగు విద్యార్థులు.. క్షేమంగా తీసుకురావాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు

యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన 4వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.

Ukraine : యుక్రెయిన్‌లో 4వేల మంది తెలుగు విద్యార్థులు.. క్షేమంగా తీసుకురావాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు

Chandrababu

Ukraine : యుక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలు భీకరంగా దాడులు చేస్తున్నాయి. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో యుక్రెయిన్ లోనే చిక్కుకుపోయిన తెలుగు వాళ్లు ప్రాణాలు గుప్పెట పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రష్యా సైనిక దాడులు ఎప్పుడు ఆగుతాయో తెలియక, యుక్రెయిన్ కు బయటి దేశాల నుంచి విమానాలు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేక తెలుగు వాళ్లు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

CM Jagan : యుక్రెయిన్‌లోని తెలుగు వారి కోసం అధికారుల‌ను నియ‌మించిన సీఎం జగన్

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన 4వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని చంద్రబాబు కోరారు. యుద్ధం కారణంగా తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. జూమ్ ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులతో మాట్లాడిన అంశాన్ని, వారి కష్టాలను జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.

Bring Telugu People Safely Stranded In Ukraine, Chandrababu Request Foreign Minister Jaishankar

Bring Telugu People Safely Stranded In Ukraine, Chandrababu Request Foreign Minister Jaishankar

యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల గురించి కేంద్రమంత్రికి లేఖ కూడా రాశారు చంద్రబాబు. ”యుక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా 4వేల మందికిపైగా తెలుగు విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఒడెస్సా, కీవ్ వంటి ముఖ్య నగరాల్లో ఉన్న తెలుగు వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చేతిలో డబ్బు లేక, నిత్యావసరాలు దొరక్క, తమను పట్టించుకునే వాళ్లు లేక అల్లాడిపోతున్నారు. యుక్రెయిన్ లో ఉన్న భారతీయులను, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు, నిపుణులను తక్షణమే స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయాలని” కేంద్ర మంత్రిని కోరారు చంద్రబాబు.

Ukraine Tension : యుక్రెయిన్‌లో 18వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు : విదేశాంగ శాఖ

“కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశంలోని వారి అయిన వారి వద్దకు మీరు చేర్చిన విధానం ఇప్పటికీ మా మదిలో నిలిచే ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొని ఉండడంతో తెలుగు వాళ్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆహారం కోసం అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీవ్, ఒడెస్సా నగరాల్లో యూనివర్సిటీలు, కార్యాలయాలు మూసివేయడంతో తెలుగు వాళ్లు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. భారత్ లోని వారి కుటుంబ సభ్యులు ఉక్రెయిన్ పరిస్థితుల గురించి తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ లో నిలిచిపోయిన తెలుగు వాళ్లను క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నాం. తద్వారా భారత్ లోని వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరట కలిగించినవాళ్లవుతారు” అంటూ చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

తెలుగు విద్యార్థులను తరలించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబుకి హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి జైశంకర్. బాధిత విద్యార్థుల వివరాలను తన కార్యాలయంతో పంచుకోవాలని చంద్రబాబుకి సూచించారాయన. చంద్రబాబు కార్యాలయంతో సమన్వయం చేసుకోవడానికి తన మంత్రిత్వ శాఖలో కొందరికి బాధ్యత అప్పగించనున్నట్లు కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు.