ఏపీ, తెలంగాణ మధ్య ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు?

  • Published By: srihari ,Published On : June 18, 2020 / 01:33 PM IST
ఏపీ, తెలంగాణ మధ్య ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు?

రాబోయే వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపే విషయంలో విజయవాడలో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య చర్చలు ముగిశాయి. ఈ సమావేశంలో బస్సు సర్వీసుల నడపడంపై చర్చించారు. అంతర్ రాష్ట్ర నిబంధనల ప్రకారం.. ఒప్పందం చేసుకొనేందుకు ప్రాథమికంగా అంగీకారించినట్టు సమాచారం. త్వరలో మరోసారి సమావేశమై ఒప్పందంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

సర్వీసులు పునరుద్ధరించడానికి ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, కంటైన్మెంట్జోన్లుపై చర్చ జరిగినట్టు తెలిపారు. నాలుగు దశల్లో బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపారు.

తొలి దశలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి తెలంగాణకు 256 సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదించినట్టు చెప్పారు. అంతర్ రాష్ట్ర ఒప్పందం కింద ఏపీ నుంచి కర్ణాటకకు 168 సర్వీసులు నడపగా, ఈ నెల 17 నుంచి బస్సు సర్వీసులను నడుపుతున్నామని అధికారి చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా బస్సు సర్వీసుల నడపడంపై తమ ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు.