CBI Speeds Up: వైఎస్ వివేకా హత్యకేసులో స్పీడు పెంచిన సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. గత నాలుగు రోజులుగా అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు.. జిల్లా స్థాయి అధికారిని కూడా పిలిపించి విచారించారు.

CBI Speeds Up: వైఎస్ వివేకా హత్యకేసులో స్పీడు పెంచిన సీబీఐ

Cbi Speeds Up Investigation On Ys Vivekananda Reddy Case

YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. గత నాలుగు రోజులుగా అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు.. జిల్లా స్థాయి అధికారిని కూడా పిలిపించి విచారించారు. అనుమానాస్పద వాహనం వివరాలు, హత్య జరిగిన తర్వాత ఫోటోలు ఎవరు తీసారనే అంశంపై ప్రశ్నించారు అధికారులు.

వివేకా హత్య కేసు విచారణలో ఇప్పటివరకు సీబీఐ అధికారులు కడప జిల్లాలో ఐదు సార్లు పర్యటించారు. అయితే రెండు సార్లు కరోనా కారణంగా సీబీఐ విచారణకు బ్రేక్ పడింది. గత నాలుగు రోజుల క్రితం కడప జిల్లాకు చేరుకున్న ఏడుగురు సీబీఐ అధికారుల బృందం పలువురిని విచారించే పనిలో నిమగ్నమైంది. కడపలోని సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని సీబీఐ అధికారులు విచారణ మొదలు పెట్టారు.

మొదటిరోజు వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా దగ్గర ఎన్ని రోజులు పని చేశావు ఎందుకు ఉద్యోగం వదులుకున్నావు అన్న కోణంలో కూడా విచారించినట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారులు ప్రధానంగా ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో సీబీఐ కార్యాలయంలో దస్తగిరిని 40 రోజులు విచారించిన అధికారులు.. మళ్లీ కడపలో జరుగుతున్న విచారణకు సైతం దస్తగిరిని పిలిచారు.

రెండో రోజు డ్రైవర్ దస్తగిరితో పాటు వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇనాయతుల్లాను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తరువాత కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆ దిశగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఆ ఫోటోలు ఎవరు తీశారు ఎవరెవరికి పంపారు? ఎందుకు పంపారు? అనే కోణాల్లో విచారిస్తుంది.

మూడో రోజు వైసీపీ కార్యకర్త సునీల్ యాదవ్‌ను విచారించిన సీబీఐ.. దస్తగిరిని మూడో రోజు కూడా ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాతో పాటు దస్తగిరిని తొమ్మిది గంటల పాటు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. నాలుగో రోజు దస్తగిరి, ఇనాయతుల్లా, వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను మళ్లీ పిలిపించారు. వీరితో పాటు మొదటిసారిగా ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రశ్నించింది సీబీఐ. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌తో పాటు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను రెండు గంటల పాటు ప్రశ్నించారు. దస్తగిరి ఇచ్చిన సమాచారం మేరకే వీరిని విచారించారా ? లేక అనుమానాస్పద వెహికల్ వివరాల సేకరణ కోసం పిలిచారా ?అన్నది తెలియాల్సి ఉంది.