మిస్టరీ వీడేనా ? : YS Viveka మర్డర్ కేసు..పులివెందులకు CBI అధికారులు

  • Published By: madhu ,Published On : July 19, 2020 / 09:46 AM IST
మిస్టరీ వీడేనా ? : YS Viveka మర్డర్ కేసు..పులివెందులకు CBI అధికారులు

ys vivekananda reddy

ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

పులివెందులకు సీబీఐ అధికారులు : – 
వివేకా హత్యకేసులో విచారణాధికారిగా ఉన్న పులివెందుల డీఎస్పీతోనూ భేటీ అయ్యి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఇక హత్య కేసును ఛేదించేందుకు 2020, July 19వ తేదీ ఆదివారం సీబీఐ అధికారులు పులివెందులలో పర్యటించనున్నారు.  ఆదివారం కడప జిల్లాలో సీబీఐ బృందం పర్యటించనుంది. పులివెందులలో వివేకా ఇంటిని పరిశీలించి.. కేసులో నిందితులుగా అనుమానిస్తున్న వారిని విచారించే అవకాశముంది.

ఏడాది పాటు మిస్టరీ : – 
సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందే ఘటన జరగడం ఏపీలో కలకలం రేపింది. అతి సామాన్యుడిలా ప్రజల మన్ననలు పొందిన వివేకానందరెడ్డిని హత్య చేయడంపై పలు అనుమానాలు రేకెత్తించాయి. ఏడాది పాటు మిస్టరీగా మిగిలిపోయిన కేసును ఛేదించేందుకు సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. కేసుకు సంబంధించి పోలీస్ అధికారుల వద్ద వివరాలు సేకరించి.. నిందితులెవరో తేల్చే పనిలో పడింది.

సీబీఐకి కేసు : – 
వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత గతంలోనే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నాలుగు నెలల ముందే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా మిస్టరీ ఇంకా వీడలేదని అప్పట్లో వ్యాఖ్యానించింది. సిట్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇప్పటికే ఈ కేసుపై మూడు సార్లు విచారణ చేపట్టారు. దాదాపు 1300 మంది అనుమానితులను విచారించారు. అయినప్పటికీ హంతకులను గుర్తించలేదన్న హైకోర్టు.. కేసుపై విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.

ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం : – 
హత్యకు రాజకీయ కారణాలా? భూమి, ఆస్తి తగాదాలా అనే
విషయాలను సిట్‌ తేల్చలేకపోయిందని చెబుతూ..హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చనే సందేహం హైకోర్టు వెలిబుచ్చింది. ఇలాంటి కేసుల దర్యాప్తులో సమయం చాలా కీలకమైందని స్పష్టం చేసింది.

సిట్ కు ఆదేశాలు : – 
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ముగించి, తుది నివేదికను దాఖలు చేయాలని సీబీఐకి సూచించింది. ఈ కేసుకు చెందిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది.

2019, మార్చి 15న హత్య : – 
వైఎస్ వివేకానంద రెడ్డిని గతేడాది మార్చి 15న అతి కిరాతకంగా నరికి చంపారు. నాటి నుంచి నేటి వరకు ఈ హత్య కేసును ఛేదించడం కోసం అప్పటి టిడిపి ప్రభుత్వం నుంచి ఇప్పటి వైసీపీ ప్రభుత్వం వరకు పలు సిట్ బృందాలు విచారణ చేపట్టాయి. అయితే ఈ సిట్ విచారణపై మొదటి నుంచి అనుమానాలు రేకెత్తిస్తూ వస్తున్నాయి.

సీబీఐ విచారణ చేయాలన్న జగన్ : – 
వివేకా హత్య జరిగిన మరుసటి రోజే వైసిపి అధినేత వైఎస్ జగన్ సిబిఐ విచారణ జరిగితే తప్ప ఈ కేసులో తమకు న్యాయం జరగదని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సిబిఐ విచారణ చేపట్టాలంటూ జగన్‌తో పాటు వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసును ఛేదించడం కోసం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.

అధికారంలోకి వైసీపీ
అటు తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడం జగన్ ముఖ్యమంత్రి కావడం, వివేకా హత్య కేసును నిగ్గు తేలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం కూడా ఈ కేసును ఛేదించడం కోసం మరో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ అధికారులు పలువురు అనుమానితులను విచారిస్తూ వస్తున్నారు.