Breaking News : రెడ్ జిల్లాగా చిత్తూరు

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 03:52 AM IST
Breaking News : రెడ్ జిల్లాగా చిత్తూరు

చిత్తూరు రెడ్ జిల్లాగా ప్రకటించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ వైరస్ త్వరగా ఎక్కువగా విస్తరిస్తున్న 96 జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి 7 జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా ఈ జాబితాలో ఉండడంతో ఆ జిల్లా వాసులను కలవరపాటుకు గురయ్యారు. మార్చి 24వ తేదీన శ్రీకాళహస్తిలో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత క్రమక్రమంగా కేసుల సంఖ్య అధికమౌతూ వస్తూ వచ్చాయి. (ఏప్రిల్ 14 : తదుపరి కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్‌)

అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. మార్చి 20వ తేదీ నుంచి జిల్లాలో ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ సోకకుండా జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకుని…ఉన్నతాధికారులు, అధికారులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో తిరుపతి 5, శ్రీకాళహస్తి 3, రేణిగుంట 2, ఏర్పేడు 1, పలమనేరు 3, నగరి 2, నిండ్రలో 1 కేసు నమోదయ్యాయి. 
 

కేంద్ర ప్రభుత్వం సూచనలు :-
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే పలు సూచనలు పాటించాలని కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి తక్షణమే పరీక్షలు నిర్వహించాలి. వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేసి..పాజిటివ్ కేసులు వస్తే..వెంటనే క్వారంటైన్ కు తరలించాలి. రెడ్ జిల్లాల పరిధిలో హాట్ స్పాట్లను గుర్తించాలి. వైరస్ ప్రబలకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. కఠినంగా అమలు చేయాలి. అవసరమైతే ఆంక్షల సమయాన్ని మరింత పెంచాలి. అత్వసర క్వారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రులను సిద్ధం చేయాలి.