తెలుగు రాష్ట్రాల జల జగడంలోకి కేంద్రం, కేసీఆర్-జగన్ కోరకుండానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 02:06 AM IST
తెలుగు రాష్ట్రాల జల జగడంలోకి కేంద్రం, కేసీఆర్-జగన్ కోరకుండానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల జగడం వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్రం రంగంలోకి దిగింది. కీలక నిర్ణయం తీసుకుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా రాష్ట్రాల సీఎంలు కోరితేనే కేంద్రం జోక్యం చేసుకోవాలి, అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. కానీ తెలుగు రాష్ట్రాలు కోరకుండానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. ఈ కౌన్సిల్ లో ఏపీ, తెలంగాణ సీఎంలు సభ్యులు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదం:
శ్రీశైలం నుంచి రోజూ మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదం నేపథ్యంలో నీళ్ల పంచాయితీకి కేంద్రం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా, కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా గల అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర జల్‌ శక్తి అధికారి మల్లిక్‌ రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు ఈ మేరకు గురువారం(మే 21,2020) లేఖ రాశారు. త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నామని, చర్చించాల్సిన అంశాలను పంపాలని ఆ లేఖలో కోరారు. 2020 జనవరిలో కార్యదర్శి దగ్గర జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి అజెండా పంపుతామని చెప్పినా ఇప్పటివరకు పంపలేదని, అత్యవసరంగా అజెండా అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను కోరారు. దీంతో సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నారు. కాకపోతే దాదాపు మొదటి సమావేశంలో చర్చించిన అంశాలే మళ్లీ అజెండాగా వచ్చే అవకాశం ఉంది.

ఆచరణకు నోచుకోని మొదటి సమావేశ హామీలు
* గోదావరి నుంచి పోలవరం ద్వారా మళ్లించే నీటిలో నాగార్జునసాగర్‌ ఎగువన వినియోగించుకోవాల్సిన నీటిని తెలంగాణకు కేటాయించడం, నీటి వినియోగంలో పారదర్శకత, టెలిమెట్రీల ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై 2016 సెప్టెంబరు 21న జరిగిన మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చించింది.
* కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2 తీర్పు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆ సమావేశంలో కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు హామీ నెరవేరలేదు. ఏడాది కాలంగా ట్రైబ్యునల్‌ సమావేశాలు కూడా జరగట్లేదు. అప్పుడే ఈ తీర్పు వచ్చే అవకాశం లేదు.
* పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల గురించి ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఈ రెండు ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని, పునర్విభజన తర్వాత కాదని తెలంగాణ సమాధానమిచ్చింది.
ఆ సమావేశం తర్వాత ఈ రెండు ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో కొన్ని ప్యాకేజీల పనులు 60 శాతానికిపైగా జరిగాయి. ఈ పథకానికి అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి మొదటి, రెండోదశ అటవీ అనుమతులు లభించాయి. పర్యావరణ అనుమతికి టీఓఆర్‌ జారీ చేసింది. పర్యావరణ ప్రభావం, తీసుకునే చర్యల గురించి నివేదికలు కూడా తయారు చేసింది.
* పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌లోకి మళ్లించే గోదావరి నీటిలో ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం 45 టీఎంసీలు తమకు కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌పై కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఎలాంటి సిఫార్సు చేయకుండానే కమిటీ కాలపరిమితి ముగిసింది. దీనిపై కేంద్రం ఎలాంటి చర్య తీసుకోలేదు.

గత సంవత్సరం సీఎంల సమావేశం:
2019 ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై గోదావరి వరద నీటిని కృష్ణా బేసిన్‌లోకి మళ్లించడం, రెండు రాష్ట్రాలు వినియోగించుకోవడంపై చర్చించారు. రెండు రాష్ట్రాల ఇంజినీర్లు కూడా ముఖ్యమంత్రుల సూచన మేరకు సమావేశమయ్యారు. కొన్ని నెలలుగా ఈ ప్రయత్నం ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో 800 అడుగుల మట్టం నుంచి రోజూ మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచేలా నిర్మాణాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మళ్లీ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ కూడా తెలంగాణలోని ప్రాజెక్టుల గురించి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కోరకుండానే కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసి జల వివాదాల గురించి చర్చించాలని నిర్ణయించినందున ముఖ్యమంత్రులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మూడు అంశాలపై చర్చ కృష్ణాబోర్డు నిర్ణయం:
మూడు అంశాలపై చర్చించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్‌)లు, టెలిమెట్రీ రెండోదశ, నిధులపై చర్చించేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖలు రాసింది. ఇవికాక ఇంకేమైనా చేర్చాలని భావిస్తే మే 26లోగా తెలపాలని సూచించింది. కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరపాలని నిర్ణయించినందున ఈలోగానే బోర్డు సమావేశమై వివాదాస్పద అంశాలను చర్చించనుంది.

Read: విశాఖ HPCL లో పొగలు…ఆందోళనలో ప్రజలు