పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలి, 2013-14 అంచనా వ్యయంతో ఎలా పూర్తవుతుంది ? – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : October 25, 2020 / 06:52 AM IST
పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలి, 2013-14 అంచనా వ్యయంతో ఎలా పూర్తవుతుంది ? – సీఎం జగన్

central Govt Should Be completed Polavaram CM Jagan : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు అంచనా వ్యయం 2013-14 ప్రకారం 20,398.61 కోట్లకే అంగీకరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపిందని జగన్‌ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. కేంద్రం చెబుతున్న 20,398.61 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కూడా పీపీఏను కోరిందని వివరించారు.

47725.74 కోట్ల అంచనా వ్యయాన్నే ఆమోదించాలి
ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2224.288 కోట్లను రీఇంబర్స్‌ చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఈ మొత్తాన్ని చెల్లిస్తే మరో 4013.65 కోట్లను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసినట్టు జగన్‌కు తెలిపారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారని వివరించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కూడా ఆమోదించిన 47725.74 కోట్ల అంచనా వ్యయాన్నే ఆమోదించాలని కోరారని చెప్పారు.

2013-14 అంచనా వ్యయంతో ఎలా పూర్తవుతుంది ?
అధికారులు చెప్పిందంతా విన్న జగన్‌.. పోలవరం ప్రాజెక్టును 2013-14 నాటి అంచనా వ్యయంతో పూర్తి చేయడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. 2017-18లో ప్రాజెక్టు అంచనా వ్యయం 55వేల 548 కోట్లతో కాకుండా… 2013-14నాటి అంచనా వ్యయం 20వేల 398 కోట్లతో పూర్తి సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. 2013-14 అంచనాల మేరకు 2234 కోట్లు రీఇంబర్స్‌ చేస్తే…. మరో 4013 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం చెప్పడం అర్థరహితమన్నారు. ఈ అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి.. రాష్ట్ర ప్రభుత్వ వాదనాలు, అభ్యంతరాలు గట్టిగా వినిపించాలని జలవనరులశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు దీనిపై లేఖలను రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారంతో లేఖలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

జాతీయ ప్రాజెక్టు
జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వమే దాన్ని పూర్తి చేయాలని జగన్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కేవలం ప్రాజెక్టు నిర్మాణ పనులను పీపీఏ పర్యవేక్షణలో చేపడుతుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం నిర్ధారించిన ధరల మేరకు చెల్లింపులు చేస్తామని అప్పట్లో కేంద్రం అంగీకరించిందని, ఇదే విషయాన్ని పీపీఏ అత్యవసర సమావేశంలో గట్టిగా వాదించండని అధికారులను ఆదేశించారు.

కేంద్ర అనుసరిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలి
2016 సెప్టెంబరులో రూపొందించిన విజ్ఞాపనపత్రాన్ని 2017 మార్చిలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదించి .. దానినే కొత్త అంచనా వ్యయంగా పేర్కొనడం అర్థరహితమన్నారు. అయినా, ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందోనని జగన్‌ రుసరుసలాడారు. ఈ తప్పంతా చంద్రబాబు సర్కారుదేనన్నారు. జాతీయహోదా కలిగిన ఇతర ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు నిర్దేశించారు. సీడబ్ల్యూసీ ఆదేశాలకు అనుగుణంగానే జాతీయహోదా ఉన్న ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నప్పుడు, పోలవరానికి కూడా అదే విధానాన్ని అమలు చేసేలా పట్టుబట్టాలని అధికారులను కోరారు.