కడప జిల్లాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : 3 థియేటర్లు సీజ్ 

  • Published By: chvmurthy ,Published On : May 3, 2019 / 03:54 PM IST
కడప జిల్లాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : 3 థియేటర్లు సీజ్ 

కడప: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా  ప్రదర్శించిన 3 సినిమా హాళ్లను ఏపీలో అధికారులు సీజ్ చేశారు.  సినిమా ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా  థియేటర్ల  లైసెన్స్ లు రద్దయ్యాయి.   ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో కడప జిల్లాలోని 3 సినిమా  థియేటర్లను జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో సీజ్ చేశారు. మే1న సినిమా విడుదల చేస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, గతంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది కి లేఖ రాశారు.  అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేంత వరకు బయోపిక్ సినిమాలు విడుదల చేయటానికి వీలులేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో ద్వివేది ఆర్జీవికి లేఖ రాశారు.

కానీ కడప జిల్లాలోని 3 సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శించారని టీడీపీ నేతలు ఎన్నికల కమీషన్ కు  ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు సంబంధిత తహశీల్దార్ లకు  థియేటర్లు  సీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. కడప లోని రాజా సినిమా హాల్,  పొరుమామిళ్లలోని వేంకటేశ్వరా సినిమా హాల్, రైల్వే కోడూరు లోని ఏ.ఎస్.ఆర్ సినిమా హాల్ ను  తహశీల్దార్ లు సీజ్ చేశారు. 3  థియేటర్లు లోనూ లక్ష్మీస్ ఎన్టీఆర్  సినిమాను గురువారం రెండు ఆటలు చొప్పున  ప్రదర్శించినట్లు తెలిసింది .  కాగా… సినిమా ప్రదర్శనను ఎందుకు అడ్డుకోలేక పోయారో వివరణ ఇవ్వాలని సీఈవో ద్వివేది జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావును కోరారు.