మండలి రద్దు : పార్లమెంట్‌లో పోరాడండి..ఎంపీలకు బాబు సూచన

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 12:49 AM IST
మండలి రద్దు : పార్లమెంట్‌లో పోరాడండి..ఎంపీలకు బాబు సూచన

మండలి రద్దు రాష్ట్రప్రభుత్వం చేతుల్లో లేదని వాదిస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ… ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో పోరాడాలని నిర్ణయించింది. 2020, జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కక్షపూరితంగా శాసనమండలి రద్దు జరిగిందనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అమరావతి అంశాన్ని కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు. రాజధాని నిర్మాణానికి పెట్టిన ఖర్చు, రైతుల పోరాటాల్ని… పార్లమెంట్ ద్వారా దేశం దృష్టికి తేవాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

మండలి రద్దు తీర్మానం ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతోంది. సర్కార్‌ నిర్ణయాన్ని వైసీపీ నేతలు బలంగా సమర్థించగా… ఈ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని టీడీపీ ఎంపీలు తెలిపారు.

* కేంద్రానికి మండలి రద్దు తీర్మానం పంపిన రాష్ట్ర ప్రభుత్వం 
* తీర్మానం కాపీతో పాటు ఓటింగ్‌ వివరాలు
* ఆర్టికల్‌-169 ప్రకారం మండలిని రద్దు చేయాలని విజ్ఞప్తి 

* హోం శాఖ పరిశీలన తరువాత పీఎంఓకి తీర్మానం
* పీఎంఓ ఆమోదిస్తే.. హోంశాఖ నుంచి న్యాయశాఖకు వెళ్లనున్న తీర్మానం
* మండలి రద్దు కోసం బిల్లు రూపొందించనున్న న్యాయశాఖ 

* క్యాబినెట్ ఆమోదం కోసం తిరిగి హోంశాఖకు వెళ్లనున్న బిల్లు
* అన్ని చోట్ల ఆమోదం లభిస్తేనే పార్లమెంట్‌కు చేరనున్న బిల్లు 
* 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు

రెండు విడతలుగా జరిగే పార్లమెంటు సెషన్‌లో ఈ తీర్మానం చర్చకు వచ్చేలా చేయడానికి వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ బిల్లు పార్లమెంటుకు వచ్చిదంటే ఆమోదం లాంఛనమే అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ చర్చకు రావాలంటే బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ముందుకెళ్లాలని భావిస్తే మాత్రం పార్లమెంటు బీఏసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని ఉభయసభల్లో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని నిర్ణయిస్తారు.

గతంలో రాష్ట్రాల నుంచి వచ్చిన ఇలాంటి విజ్ఞప్తులను మూడు లేదా నాలుగు నెలల్లో కేంద్రం ఆమోదించి పంపిన సందర్భాలున్నాయి. రెండు సభలూ సాధారణ మెజారిటీతో ఈ బిల్లును ఆమోదిస్తే ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

Read More : కరోనా కాటేస్తోంది : టెస్ట్ శాంపిల్స్‌కు తెలంగాణలో ల్యాబులెక్కడ?!