ఎయిర్ పోర్టులో బాబు నిర్భందం, పోలీసులతో వాగ్వాదం

ఎయిర్ పోర్టులో బాబు నిర్భందం, పోలీసులతో వాగ్వాదం

Chandra Babu : చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రేణిగుంట ఎయిర్ పోర్టులో టీడీపీ చీఫ్ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బాబు వాగ్వాదానికి దిగారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారులను అన్ని మూసివేశారు.

గాంధీ విగ్రహం వద్ద వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ నిరసన చేపట్టేందుకు చిత్తూరుకు బాబు వచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులను నిరసిస్తూ.. ఆందోళనకు దిగనున్నారు చంద్రబాబు. జిల్లాలో టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. చంద్రబాబు చిత్తూరు పర్యటన, నిరసన దీక్షకు అనుమతి లేదంటున్నారు చిత్తూరు పోలీసులు. కోవిడ్, మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో.. టీడీపీ అధినేత టూర్‌కు నో చెబుతుండటంతో.. చంద్రబాబు పర్యటనపై సస్పెన్స్‌ నెలకొంది.

మున్సిపోల్స్‌ ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు రెడీ అయ్యారు. పురపాలక ఎన్నికల ప్రచారం మొదటుపెట్టనున్నారు. నగర పంచాయతీలతో పాటు వివిధ మున్సిపాలిటీలల్లోనూ ఆయన ప్రచారం నిర్వహించేలా.. తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే మొత్తం 12 కార్పొరేషన్లలో చంద్రబాబు ప్రచారం చేసేలా కార్యచరణ సిద్ధమవుతోంది. ఇప్పటికే 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది.

మేనిఫెస్టోలో ఉన్న హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా చంద్రబాబుతో పాటు లోకేశ్‌, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇతర ముఖ్యనేతలు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోడ్ షోల ద్వారా వీలైన ఎక్కువ ప్రాంతాలు చుట్టేలా ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచారంతో పాటు.. అధికార పార్టీని ఫోకస్‌ చేయనున్నారు టీడీపీ నేతలు. వైసీపీ నేతలు అరాచక పాలన సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న దేశం నేతలు.. వాటిపైనా పోరాటాలకు సిద్ధమవుతున్నారు.