తప్పులు సరిదిద్దుకునే పనిలో చంద్రబాబు, పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో తిరిగి పట్టు సాధిస్తారా

  • Published By: naveen ,Published On : November 3, 2020 / 05:13 PM IST
తప్పులు సరిదిద్దుకునే పనిలో చంద్రబాబు, పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో తిరిగి పట్టు సాధిస్తారా

chandrababu: గత ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాల్లో జరిగిన తప్పిదాలను సెట్‌ చేసుకొనేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. బీసీల విషయంలో శీతకన్ను వేయడంతో మొన్నటి ఎన్నికల్లో భారీగానే మూల్యం చెల్లించుకుందని భావిస్తున్న నేపథ్యంలో కొత్త ఆలోచనలు చేస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ల పంపిణీ వ్యవహారంలో కొన్ని తప్పటడుగులు, అసంతృప్తి సెగలు.. వెరసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

బీసీలను పట్టించుకోలేదన్న విమర్శలు:
పార్టీ వేసిన తప్పటడుగులతో పార్టీకి చెందిన కొంతమంది బీసీ నేతలు అధిష్టానంపై కినుక వహించారు. ముఖ్యంగా జిల్లాలో రాజులకు పెద్ద పీట వేయడం ద్వారా మెజార్టీ ఓటర్లున్న బీసీలను పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఒక్కొక్కటిగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందని చెబుతున్నారు. పాత, కొత్తల కలయికతో పార్టీ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడ్డారు పార్టీ పెద్దలు. ఇప్పటికే విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను యువకుడైన కిమిడి నాగార్జునకు అప్పగించారు.
https://10tv.in/seniors-angry-on-chandrababu-naidu/
మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు తీవ్ర నిరాశ:
గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయినా… బొత్స సత్యనారాయణకు గట్టి పోటీ ఇచ్చారు నాగార్జున. అందుకే ఆయనకు విజయనగరం పార్లమెంటరీ కమిటీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారని అంటున్నారు. మహిళా ఇన్‌చార్జి బాధ్యతలను మరో బీసీ నేత, నెల్లిమర్ల మాజీ ఎంపీపీ సువ్వాడ వనజాక్షికి అప్పగించారు. విజయనగరం పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి పదవిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎప్పటి నుంచో ఆయన జిల్లా అధ్యక్ష పదవి కోసం వేచి చూస్తున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఆయన తిరుగుబావుటా ఎగురవేసినా… నెమ్మదిగా పరిస్థితులులు సర్దుకుంటాయన్న ఆశాభావంతో అధిష్టానం తన పని తాను చేసుకుపోతోందని అంటున్నారు.

ఇంకా అసంతృప్తిలోనే మీసాల గీత:
మరో బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ఇంకా అసంతృప్తి నుంచి బయటకు రాలేదని చెబుతున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్‌ అయిన తనని కాదని, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు విజయనగరం ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చినప్పటి నుంచి ఆమె గుర్రుగా ఉన్నారట. ఈ విషయంలో కూడా అధిష్టానం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో గీత కుటుంబానికి సముచిత స్థానం ఇస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పొలిట్‌బ్యూరోలో కూడా జిల్లాకు సముచిత స్థానం:
తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరోలో కూడా జిల్లాకు సముచిత స్థానం లభించింది. పొలిట్‌బ్యూరోలో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సుదీర్ఘ కాలంగా ఉన్నారు. ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వడంతో పాటు కొత్తగా, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు, సాలూరుకు చెందిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి అవకాశం కల్పించారు. పొలిట్‌బ్యూరోలో జిల్లా నుంచి మహిళకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమం. సాలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల పోటీ చేసిన ఆమె.. వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓటమి పాలయ్యారు. సంధ్యారాణి సేవలను గుర్తించిన అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.

గుమ్మిడి సంధ్యారాణికి సముచిత స్థానం కల్పించడానికి కారణమదే:
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సమయంలో కూడా సంధ్యారాణి క్రియాశీలకంగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నందునే అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలిగా పార్టీ నియమించిందని అంటున్నారు. తాజాగా పొలిట్‌బ్యూరోలోనూ స్థానం ఇవ్వడంతో ఫుల్‌ హ్యాపీగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి విజయనగరం జిల్లా నుంచి కేవలం అశోక్‌ గజపతిరాజుకే పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవకాశం లభించేది. గిరిజనుల కోటాలో గుమ్మిడి సంధ్యారాణికి పార్టీ సముచిత స్థానం కల్పించడం ఆ వర్గాలను ఆకట్టుకునేందుకేనని టాక్‌.

ఒకప్పుడు కంచుకోటలా ఉన్న జిల్లాను మళ్లీ గ్రిప్‌లోకి తెచ్చుకోవాలని ప్లాన్:
టీడీపీ జాతీయ కమిటీలో విజయనగరం జిల్లాకు స్థానం దక్కలేకపోయినా… త్వరలో ప్రకటించనున్న రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్ద పీట వేస్తారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని ప్రకటించిన అధిష్టానం.. మిగతా కమిటీని త్వరలో ప్రకటించనుంది. రాష్ట్ర కమిటీలో జిల్లాకు సంబంధించి సుజయ్‌ కృష్ణరంగారావు, పడాల అరుణ, ఎస్‌ఎన్‌ఎం రాజు, ఐవీపీ రాజు, ఆర్‌పీ భంజ్‌దేవ్‌, బేబీ నాయన, తెంటు లక్ష్ముంనాయుడు, కోళ్ల రామప్రసాద్‌, ప్రసాదుల రామకృష్ణ, త్రిమూర్తుల రాజుతో పాటు పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారికి పార్టీ పదవులే పెద్ద గుర్తింపు. పార్టీ పదవుల్లో కూడా జిల్లాకు పెద్ద పీట వేసి, ఒకప్పుడు కంచుకోటలా ఉన్న జిల్లాను మళ్లీ గ్రిప్‌లోకి తెచ్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు.

https://www.youtube.com/watch?v=5jgPHt1jdJw