బలమైన రెడ్లను కాదని ఊహించని నేతకు చంద్రబాబు ప్రమోషన్, నెల్లూరు టీడీపీకి వర్కవుట్ అయ్యేనా మైనార్టీ ఈక్వేషన్

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 05:36 PM IST
బలమైన రెడ్లను కాదని ఊహించని నేతకు చంద్రబాబు ప్రమోషన్, నెల్లూరు టీడీపీకి వర్కవుట్ అయ్యేనా మైనార్టీ ఈక్వేషన్

abdul aziz : గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ ఒకరు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల వరకు అబ్దుల్‌ అజీజ్‌ అంటే ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఆక్వా రంగంలో బడా వ్యాపారిగా మాత్రమే జిల్లా ప్రజలకు తెలుసు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. ఉన్నత విద్యావంతుడు. ఉన్నట్టుండి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయి ఐదేళ్లు అధికార పార్టీ మేయర్‌గా కొనసాగారు.

రెడ్లను పక్కన పెట్టి అబ్దుల్ అజీజ్‌కు బాధ్యతలు:
బలమైన రెడ్డి సామాజిక వర్గమున్న నెల్లూరు జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం అబ్దుల్ అజీజ్‌ను వరించింది. ఈ అధ్యక్ష పీఠం కోసం సీనియర్ నాయకులు పెళ్ళకూరు శ్రీనివాసులరెడ్డితోపాటు మాజీ మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితుడు వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి కూడా పోటీ పడినా అధిష్టానం మైనార్టీ నేత వైపే మొగ్గు చూపింది. సాధారణంగా మైనారిటీ నేతలకు పార్టీలో కీలక పదవులు దక్కాలంటే సవాలక్ష ఈక్వేషన్లు ఉండాలి. దానికి తోడు కాస్త అదృష్టం కూడా వరించాలి. కానీ పార్టీ అధినేత చంద్రబాబు ఇంతమంది రెడ్లను పక్కన పెట్టి అబ్దుల్ అజీజ్‌కు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాడంటే దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు.

ఓడిపోతానని తెలిసినా చంద్రబాబుపై గౌరవంతో పోటీ:
2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ టికెట్‌ను అజీజ్‌ ఆశించారు. కానీ అప్పటివరకు మంత్రిగా ఉన్న నారాయణకు ఆ టికెట్‌ను అధిష్టానం కేటాయించింది. దీంతో కొంత అసంతృప్తికి గురైన అబ్దుల్ అజీజ్.. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అదే సమయంలో నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత ఆఖరు నిమిషంలో ప్రస్తుత వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారు. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం అబ్దుల్ అజీజ్‌ను బరిలో నిలిపింది. ఒక పక్క కనీసం ప్రచారం చేసుకోవడానికి కూడా తగినంత సమయం లేకపోయినా… ప్రత్యర్థిపై ఓడిపోతానని తెలిసినా చంద్రబాబు మాటపై గౌరవంతో పోటీ చేసి ఓటమి పాలయ్యారని అంటున్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే నాయకుల్లో ప్రధానమైన వ్యక్తిగా గుర్తింపు:
ఎన్నికల అనంతరం అప్పటివరకు అధికారాన్ని అనుభవించిన నేతలు అడ్రస్ లేకుండా పోయారు. దీంతో గత కొంతకాలంగా అబ్దుల్ అజీజ్.. ఒకరిద్దరు నాయకులను కలుపుకొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు, ధర్నాలు చేపడుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే నాయకుల్లో ప్రధానమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడా రాజీ పడకుండా అధికార పార్టీపై పోరాటాలు చేస్తూ కేడర్‌లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అందుకే అబ్దుల్ అజీజ్‌కు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష పీఠాన్ని చంద్రబాబు అప్పగించారని అంటున్నారు.

మైనార్టీ నేతకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి కారణం ఇదే:
అంతేకాక నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండున్నర లక్షలకు పైగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. బలమైన బీసీ ఓట్లు కూడా ఉన్నాయి. అజీజ్ పై పార్టీ పెద్దలకు ఉన్న నమ్మకంతో పాటు ఈ ఈక్వేషన్ కూడా ఒకటి అంటున్నారు. అందుకే అధ్యక్ష రేసులో ఎందరున్నా మైనారిటీ నేత అబ్దుల్ అజీజ్‌కే అధ్యక్ష పదవి దక్కిందంటున్నారు విశ్లేషకులు. మరి రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే నెల్లూరు జిల్లాలో మైనారిటీ నేత తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లగలడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అబ్దుల్ అజీజ్ పార్టీని ఎలా నడిపిస్తారో చూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=5sv9a8CLWv4