అదే జరిగుంటే వైసీపీ ఇప్పటికే పతనమయ్యేది, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అదే జరిగుంటే వైసీపీ ఇప్పటికే పతనమయ్యేది, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

chandrababu on panchayat elections: పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగి ఉంటే టీడీపీకి మరో 10 శాతం ఫలితాలు పెరిగేవని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. అదే జరిగి ఉంటే వైసీపీ ఇప్పుడే పతనమై ఉండేదన్నారు. అధికార దుర్వినియోగంపై ఆధారపడి వైసీపీ ఎక్కువ శాతం స్థానాలను గెలుచుకుందని చంద్రబాబు చెప్పారు. పోలీసులు ఉంటేనే వైసీపీ నేతలు ప్రతాపం చూపుతారని ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని మండిపడ్డారు.

రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పతనానికి ఇది ఆరంభం మాత్రమేనని… ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని చంద్రబాబు ప్రశంసించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేశారని అన్నారు. అన్ని చోట్లా ఏకగ్రీవాలు చేసుకోవాలనుకున్న వైసీపీ కుట్రలు సాగలేదని చెప్పారు. కొత్తవలసలో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థికి 250 ఓట్ల మెజార్టీ వచ్చినా రీకౌంటింగ్ కోరతారా? అని మండిపడ్డారు. టీడీపీ గెలిస్తే రీకౌంటింగ్ చేస్తారని… వైసీపీ గెలిచిన చోట రీకౌంటింగ్ చేయరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, సీఎం జగన్ చేసిన అభివృద్ధిని చూసి గ్రామీణ ఓటర్లు వైసీపీకి ఓటు వేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల జగన్ పై ప్రజలకు నమ్మకం అమాంతం పెరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన మంత్రి.. ఏపీలో 13,095 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 10,524 పంచాయతీలు వైసీపీ మద్దతుదారుల కైవసం అయ్యాయని తెలిపారు. టీడీపీకి 2,063 పంచాయతీలు దక్కాయన్నారు.