”సీఎం జగన్ ప్రతీకారంతో రగిలిపోతున్నారు”

టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టులను టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు. సీఎం

  • Published By: naveen ,Published On : June 13, 2020 / 05:28 AM IST
”సీఎం జగన్ ప్రతీకారంతో రగిలిపోతున్నారు”

టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టులను టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు. సీఎం

టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టులను టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ ప్రతీకారంతో రగిలిపోతున్నారని చంద్రబాబు అన్నారు. తాను జైలుకి వెళ్లానన్న అక్కసుతో ఇతరులను కూడా జైలుకి పంపాలని జగన్ కక్ష పెంచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిన్న అచ్చెన్న, నేడు ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కక్ష సాధింపు చర్యలని చంద్రబాబు అన్నారు. జగన్ తన ఏడాది పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా అక్రమ అరెస్టులకు తెరతీశారని చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జగన్ కక్ష సాధింపు చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

బీసీ నేత అచ్చెన్న అక్రమ అరెస్టుని పక్కదారి పట్టించేందుకే:
అచ్చెన్నాయుడు, అస్మిత్ రెడ్డి అరెస్టులను లోకేష్ సైతం ఖండించారు. బీసీ నేత అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుని పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ని అరెస్ట్ చేశారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ నేతలను జైల్లో పెట్టి జగన్ రాక్షసానందం పొందాలనుకుంటున్నారని లోకేష్ అన్నారు. ప్రలోభాలకు లొంగితే వైసీపీ కండువా, లొంగకుంటే జైలే అని లోకేష్ చెప్పారు. జగన్ టెర్రరిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు.

ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్న అరెస్ట్:
ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని శుక్రవారం(జూన్ 12,2020) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి.. సోదాలు కూడా నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ కూడా రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

ఏపీ ఈఎస్ఐలో భారీ స్కామ్:
ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. ఈఎస్ఐ డైరెక్టర్లు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. మొత్తం రూ.988 కోట్లకు సంబంధించి రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగిందని గుర్తించారు. ఈఎస్‌ఐ రవికుమార్, రమేష్, విజయను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే.. 135శాతం అధికంగా టెండర్లలో చూపించిన సంస్థలు నకిలీ కొటేషన్లతో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్న పాత్ర ఉందని నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

బీఎస్‌-3 వాహనాలు, నకిలీ NOC, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో జేసీ అరెస్ట్:
అచ్చెన్న షాక్ ఘటన నుంచి తేరుకోక ముందే టీడీపీకి మరో బిగ్ షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం(జూన్ 13,2020) ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కొడుకు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అనంతరం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్‌ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి.