బాబు మాస్టర్ ప్లాన్ : హిందూ జపం, వారం రోజుల పాటు పూజలు

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 06:37 AM IST
బాబు మాస్టర్ ప్లాన్ : హిందూ జపం, వారం రోజుల పాటు పూజలు

Telugu Desam Party : అంతర్వేది రథం దగ్ధం ఘటనతో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ …ఏకంగా సీబీఐ దర్యాప్తుకు డిమాండ్‌ చేసింది. ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తోందని ఆరోపిస్తోంది. అంతేకాదు.. ఏపీలో మత మార్పిళ్ల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కూడా టీడీపీ భావిస్తోంది.

అంతర్వేది ఘటనపై ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. అయినా ఈ వివాదాన్ని ఇంతటితో వదిలకూడదని టీడీపీ యోచిస్తోంది. రథం దగ్దంపై భవిష్యత్‌ కార్యాచరణను టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధం చేశారు. వారం రోజుల పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు.



2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం సూర్యదేవాలయాల్లో పూజలు నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సోమవారం శివాలయాల్లో, మంగళవారం ఆంజనేయస్వామి, కుమార స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నారు. బుధవారం అయ్యప్ప, గణపతి దేవాలయాల్లో, గురువారం సాయిబాబా ఆలయాల్లో పూజలతో ప్రభుత్వానికి నిరసన తెలియజేయనున్నారు. శుక్రవారమేమో కనకదుర్గ అమ్మవారి ఆలయాల్లో… ఇక శనివారం వైష్ణవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ.. జగన్‌ సర్కార్‌కు తమ నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

మతం పేరెత్తితేనే ఒకప్పుడు భయపడిపోయే చంద్రబాబు… ఇప్పుడు హిందూ జపం చేస్తున్నారు. ఒక మతం గురించి మాట్లాడితే, మరో మతం వారు ఎక్కడ దూరమవుతారోనన్న భయంతో… మతం గురించి మాట్లాడేందుకే చంద్రబాబు ఒకప్పుడు భయపడిపోయేవారు. ఇప్పుడైతే హిందూధర్మ గురించి, దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు.



తమ పార్టీ ప్రతినిధులను, అందరికంటే ముందుగానే సంఘటనా స్థలాలకు పంపిస్తున్నారు. అంతర్వేది ఘటన తర్వాత జనం మూడ్‌ను గమనించిన చంద్రబాబు…. అందుకు తగ్గట్టుగా ఫ్యూచర్‌ ప్లాన్స్‌ వేస్తున్నారు. ఏపీలో గత 15 నెలల నుంచి దేవాలయాలపై దాడులు, విగ్రహాలకు అవమానాలు, రథాల దగ్దంలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిపై బీజేపీ పోరాటం చేసినా.. అధికార పార్టీతో రహస్య స్నేహం కారణంగా… పెద్దగా మైలేజ్‌ రావడం లేదని టీడీపీ విశ్లేషించింది.

అదే సమయంలో మెజార్టీ వర్గీయులైన హిందువులకి అండగా ఉంటే.. రాజకీయ ప్రయోజనం కూడా ఉంటుందని టీడీపీ ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతలు… టీడీపీని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో మత రాజకీయాలు చేయటం ద్వారా.. జగన్‌ ప్రభుత్వానికి ముకుతాడు వేయవచ్చనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్వేది ఘటన మరింత రచ్చ కాకూడదనే సీబీఐ విచారణ కోరారు.



గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ హడావుడి చేయడంతోనే.. జగన్‌ సీబీఐ విచారణకు ఇవ్వాల్సి వచ్చిందన్న ప్రచారం కూడా సాగుతోంది. హిందూ మతానికి ప్రతినిధిగా ఉందనుకుంటున్న బీజేపీ.. మొహమాటాలతో ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించలేకపోతుంది. ఇదే అదనుగా టీడీపీ ఎంటరై.. హిందువులకు అండగా నిలబడి.. రాజకీయ ప్రయోజనం పొందాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు… ముస్లిం, క్రైస్తవులకు ఎంత చేసినా.. ఎన్ని పదవులిచ్చినా… ఆ తరగతి ప్రజలు మాత్రం వైసీపీకే జైకొట్టారు. అందుకే ఈ వర్గాలపై టీడీపీ పూర్తిగా ఆశలు వదిలేసింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే విజయవాడ పుష్కరాల సమయంలో 46 ఆలయాలు కూల్చేశారు కదా… అలాంటి పార్టీకి హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని వైసీపీ, బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.



టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖకు మంత్రి బీజేపీ నాయకుడే ఉన్నారని… అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని.. బీజేపై ఎదురుదాడికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. మొత్తానికి హిందూ మతాన్ని మచ్చిక చేసుకొని రాజకీయ లబ్ది పొందాలనే టిడిపి ఆలోచన ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.