తెలుగుదేశం బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు? మహేష్‌ను మెప్పించేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్

  • Published By: naveen ,Published On : October 23, 2020 / 11:29 AM IST
తెలుగుదేశం బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు? మహేష్‌ను మెప్పించేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Mahesh babu: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు.. తెలుగుదేశం పార్టీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ కాబోతున్నారా? మహేశ్‌ను మెప్పించేలా టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న అడుగులు చూస్తే అలా అనిపిస్తోందని టాక్‌. ఎలాంటి పదవులూ వద్దంటున్న గల్లా ఫ్యామిలీకి కొత్త కమిటీలోనూ బాబు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక మహేశ్‌ను పార్టీకి మరింత దగ్గర చేయాలన్న వ్యూహముందా? అసలు ఈ బాబు ప్లాన్‌కు ఆ బాబు లొంగుతాడా?

తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల విషయంలో రకరకాల ప్రచారం సాగుతోంది. కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చారనే వారు కొందరైతే.. సరైన నేతలకు చోటు ఇవ్వలేదని మరికొందరు నేతల వాదన. ఇప్పుడు మరో ప్రచారం జోరందుకుంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును పార్టీకి దగ్గర చేసుకునేందుకు… పార్టీకి అండగా ఉండేలా చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్‌ చేశారని అంటున్నారు. మహేశ్‌బాబు కోసం త్యాగాలు చేశారని పార్టీ నేతలే చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

జగన్‌ వేవ్‌లోనూ గల్లా గెలవడం వెనుక మహేశ్‌ పిలుపే కారణం:
2014, 19 ఎన్నికల్లో మహేశ్‌బాబు నేరుగా టీడీపీకి మద్దతు తెలపకపోయినా.. వారి కుటుంబం నుంచి ఎంపీ రేసులో ఉన్న గల్లా జయదేవ్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్‌ వేవ్‌లోనూ గల్లా గెలవడం వెనుక మహేశ్‌ పిలుపు కూడా ఓ కారణమేనని అంటారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ సింపతీ కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని అంటున్నారు. ఈ విషయంలో కొన్ని లాజిక్కులు కూడా చెబుతున్నారు.

గల్లా కుటుంబానికి రెండు పదవులు:
పార్టీ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర కమిటీతో పాటు పొలిట్‌బ్యూరోలో ఎక్కడెక్కడి నేతలనో పిలిచి పదవులు అప్పగించారు చంద్రబాబు. కీలకమైన కేశినేని నాని, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వంటి వారిని పక్కన పెట్టడం కూడా చర్చనీయాంశమైంది. అలాగని పదవులు లేవు.. అందుకే ఇవ్వలేదని అనుకోవడానికి వీల్లేదని అంటున్నారు. ప్రధానంగా గల్లా కుటుంబానికి రెండు పదవులు కేటాయించారు. ఎంపీ గల్లా జయదేవ్‌ను పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్‌ బ్యూరోలోకి తీసుకున్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదంట.


రాజీనామా చేసిన అరుణకు కీలక పదవి ఇవ్వడంపై విస్మయం:
జయదేవ్‌ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ ఈ మధ్యనే రాజీనామా చేశారు. ఇందుకు కారణాలను కూడా చెప్పారామె. పార్టీలో కొత్త నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో అధిష్ఠానం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకే వీలుగానే పక్కకు తప్పుకున్నట్టు తెలిపారు. వయసు కూడా పైబడినందున పార్టీ కోసం కష్టపడి తిరిగి పని చేయలేక పోతున్నానని స్పష్టంగా చెప్పారు. కానీ, చంద్రబాబు మాత్రం అవేవీ పట్టించుకోలేదని అంటున్నారు. అరుణ కుమారికి మరోసారి పదవి కేటాయించారు.

వద్దన్నా గల్లా కుటుంబానికి పదవులు ఇవ్వడానికి కారణం ఇదే:
తాను పని చేయలేనని చెప్పి.. పట్టుమని పది రోజులు కూడా తిరగక ముందుగానే.. అరుణకు మరో కీలక పదవిని ఎందుకు కట్టబెట్టారు? నాయకులు చాలా మందే పదవులు లేకుండా ఉన్నారు కదా.. అని గుంటూరు నేతలు మైండు పెట్టి బాగా ఆలోచించారంట. అప్పుడు వారి మైండ్‌లో అద్భుతమైన లాజిక్‌తో కూడిన ఆలోచన ఒకటి వచ్చిందంటున్నారు. సూపర్ స్టార్ మహేశ్‌బాబును మచ్చిక చేసుకోవడానికే చంద్రబాబు ఇలా చేశారని అనుకుంటున్నారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో మహేశ్‌ను ఫుల్లుగా వాడేసుకోవాలని బాబు పెద్ద ప్లానే వేశారని గుసగుసలాడుకుంటున్నారు. అందుకే వద్దన్నా వారికి పదవులు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నారని అంటున్నారు.