జనసేనానికి చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

జనసేనానికి చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ వెల్లువగా వస్తున్న తరుణంలో చంద్రబాబు ట్వీట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

గతంలో టీడీపీతో కలిసి పనిచేసినప్పటి ఫొటోతో చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫొటోను ఉంచి నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ ప్రజా క్షేత్రంలో ప్రయాణిస్తున్న మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడివ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. 

చంద్రబాబు నాయుడు ట్వీట్‌లో ‘తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించి, విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 

నారా లోకేశ్ ట్వీట్‌లో ‘జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉన్నతమైన భావాలతో ప్రజాక్షేత్రంలో ప్రయాణిస్తున్న మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 

2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసినప్పటికీ ఇరు పార్టీలు ఇంకా సపోర్టివ్‌గానే కొనసాగుతున్నాయనే విధంగా వైసీపీ మంత్రి బొత్స సత్యానారాయణ మాట్లాడారు. టీడీపీకి జనసేన వత్తాసు పలకడమేంటని ప్రశ్నించారు.