రాజీనామా ఎందుకు చేయాలి ? కుప్పంలో ఓటమిపై అధైర్యపడొద్దన్న చంద్రబాబు

రాజీనామా ఎందుకు చేయాలి ? కుప్పంలో ఓటమిపై అధైర్యపడొద్దన్న చంద్రబాబు

Chandrababu Naidu : ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నికల ఫలితాలతో టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కుప్పంలో టీడీపీ మద్దతుదారుల ఓటమిపై స్పందించిన చంద్రబాబు… తాను రాజీనామా ఎందుకు చేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటూ ఆరోపించారు. రాజీనామా విషయంపై మండిపడ్డారు చంద్రబాబు. కుప్పంలో వైసీపీ ఉన్మాదం గెలిచి, ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు. కుప్పంలో టీడీపీ మద్దతుదారుల ఓటమితో అధైర్యపడాల్సిందేమీ లేదని పార్టీ శ్రేణులకు సూచించారు చంద్రబాబు.

ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు…పార్టీ మద్దతుదారులకు భరోసా ఇచ్చారు. సర్కార్‌ పెద్దల కామెంట్స్‌ను పరిశీలిస్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే యత్నం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో సహా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ మద్దతుదారులతో సమావేశమైన చంద్రబాబు…వారందరికీ ఓ హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి కోసం పరితపించిన టీడీపీ మద్దతుదారులను వైసీపీ బెదిరించినా ధైర్యంగా ముందడుగు వేయాల్సిందేనన్నారు.

ఈ రోజు మీకు, మీ గ్రామానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు భవిష్యత్తులో వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత తనది అన్నారు. తొలివిడతలో 38 శాతం, రెండో విడతలో 39 శాతం, మూడో విడతలో 40 శాతం పంచాయతీలను గెలుచుకున్నామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం – రాజారెడ్డి రాజ్యాంగం మధ్య పోరాటంలో….ఫలితాలు తారుమారవడంతో ప్రజాస్వామ్యం అపజయం పాలైందన్నారు చంద్రబాబు. చంద్రబాబు వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. కుప్పంలో టీడీపీ అడ్రస్‌ గల్లంతయ్యిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దుకాణం మూసుకోవాల్సిందేన్నారు.