Chandrababu Pawan Kalyan : టార్గెట్ జగన్.. గంటసేపు ఏకాంతంగా చంద్రబాబు, పవన్ భేటీ.. ఉమ్మడి వేదిక ఏర్పాటు సహా కీలక అంశాలపై చర్చ

చంద్రబాబు, పవన్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. భేటీలో వారు ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? పొత్తుల గురించి ప్రస్తావన వచ్చిందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Chandrababu Pawan Kalyan : టార్గెట్ జగన్.. గంటసేపు ఏకాంతంగా చంద్రబాబు, పవన్ భేటీ.. ఉమ్మడి వేదిక ఏర్పాటు సహా కీలక అంశాలపై చర్చ

Chandrababu Pawan Kalyan : ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీతో పొత్తు ఉన్నా కలిసి బలంగా పని చేయలేకపోతున్నా, వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుంది అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం, ఆ కాసేపటికే.. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ తో భేటీ కావడం.. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. జనసేనాని పవన్ బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీతో కలిసి పని చేయబోతున్నారా? అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు, పవన్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. భేటీలో వారు ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? పొత్తుల గురించి ప్రస్తావన వచ్చిందా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, చంద్రబాబు-పవన్ భేటీలో తొలి 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఉన్నారు. ఆ తర్వాత గంట పాటు చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు.

విశాఖలో ప్రభుత్వం, పోలీసుల తీరును చంద్రబాబుకు వివరించారు పవన్. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ఇరువురూ చర్చించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒకే వేదిక మీద తేవాలని పవన్-చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కాగా, లెఫ్ట్ పార్టీలను, బీజేపీని ఒకే వేదిక మీదకు తేవడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని అభిప్రాయపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలనే కోణంలో ప్రయత్నం చేయాలని భావించారు. ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే ప్రభుత్వాన్ని దారిలోకి తేవడం పెద్ద కష్టం కాదన్నారు పవన్. ఎన్నికల వరకు ఉమ్మడి వేదికగా పోరాటాలు చేస్తే ఫలితం ఉంటుందని ఇరువురూ భావించారు.

ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తారనే ప్రచారం పైనా నేతల భేటీలో ప్రస్తావన జరిగినట్లు తెలుస్తోంది. ఓవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తూనే ఎన్నికలకు సిద్దమవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు, పవన్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తీసుకునే స్టాండ్ ఏ విధంగా ఉండబోతోందనే అంశంపైనా ఇరువరూ చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా.. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లగా.. అధికారాన్ని దక్కించుకున్నారు. 2019లో వీరి మధ్య పొత్తు చెదిరింది. విడివిడిగా ఎన్నికలకు వెళ్లి ఓటమిని మూటగట్టుకున్నాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వాన్ని ఉమ్మడి కార్యాచరణతో గద్దె దించేందుకు చంద్రబాబు, పవన్ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు బీజేపీలో కొందరు వైసీపీకి మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడటంపై పవన్ విసుగు చెందినట్లు తెలుస్తోంది.