జగన్ బీసీ వ్యతిరేకి.. బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రవీంద్ర అరెస్ట్‌ను చంద్రబాబు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జగన్ బీసీ వ్యతిరేకి.. బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు

chandrababu warns ap cm jagan: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రవీంద్ర అరెస్ట్‌ను చంద్రబాబు ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను అడ్డుకున్న బీసీలను కేసులతో వేధిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే రవీంద్రను విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు చేశారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా? అని ప్రశ్నించారు. రవీంద్ర చేసిన నేరమేంటని నిలదీశారు.

పోలింగ్ బూతుల్లోకి వెళ్లి దొంగ ఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. జగన్ బీసీ వ్యతిరేకి అని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు, దాడులు, అరెస్టులు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల వ్యతిరేకి అయిన జగన్‌కు బీసీలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని చంద్రబాబు హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ పై చేయిచేసుకున్నారన్న ఆరోపణలపై కొల్లు రవీంద్రను గురువారం(మార్చి 11,2021) ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించాంటూ కొల్లు రవీంద్ర నిన్న(మార్చి 10,2021) మచిలీపట్నం జలాల్‌పేటలోని పోలింగ్ కేంద్రం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వైసీపీ ఏజెంట్లు ఆయనతో వాగ్వివాదానికి దిగారు.

కల్పించుకున్న పోలీసులు రవీంద్రను వెళ్లిపోవాలని సూచించారు. దీంతో రవీంద్ర మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట కూడా జరిగింది. గెలుపు కోసం పేర్ని నాని విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

కొల్లు రవీంద్ర అరెస్టు బీసీలపై కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు నిదర్శనమని టీడీపీ ఏపీ అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. రవీంత్ర అరెస్టును ఆయన ఖండించారు. కొల్లు రవీంద్ర‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండుగ‌ రోజున కూడా టీడీపీ నేతలను అరెస్టులతో వెంటాడుతున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ మాత్రం తన కుటుంబంతో హాయిగా పండుగ జరుపుకుంటున్నార‌ని చెప్పారు.

జగన్ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్న అన్నారు. జ‌గ‌న్ ప్రజాస్వామ్యాన్ని కూడా లెక్కచేయట్లేద‌ని మండ‌పడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే బీసీలపై జ‌గ‌న్ కన్నెర్ర చేశారని, వైసీపీ అక్రమాలను అడ్డుకున్నందుకే కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని అచ్చెన్న ఆరోపించారు.

వైసీపీ నేత‌లు అధికారాన్ని అడ్డు పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని అచ్చెన్న ఆరోపించారు. వారిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాల‌న్నారు.