బెజవాడ దుర్గగుడిలో చంద్రబాబు భార్య క్షుద్రపూజలు చేయించారు, మాయమైన 3 సింహాలు బుద్ధా వెంకన్న ఇంట్లో ఉన్నాయి

  • Published By: naveen ,Published On : September 17, 2020 / 05:14 PM IST
బెజవాడ దుర్గగుడిలో చంద్రబాబు భార్య క్షుద్రపూజలు చేయించారు, మాయమైన 3 సింహాలు బుద్ధా వెంకన్న ఇంట్లో ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో అంతర్వేది రథం దగ్ధం కాక చల్లారక ముందే.. విజయవాడ దుర్గగుడి రథంలో మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమవడం హీట్‌ని పెంచింది. ఇంద్రకీలాద్రి రథంపై వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై.. ఈవో సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది తర్వాత.. రథం తీయలేదని వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనుల నిమిత్తం రథం పరిశీలిస్తే.. 3 వెండి సింహాలు మాయమైనట్లు గుర్తించామన్నారు.

ఈ ఘటనపై.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రథంలోని వెండి సింహాల మాయంపై.. కమిషనర్ ఆదేశాల మేరకు ఈవో సురేశ్ బాబు మరో కమిటీ వేశారు. ఐదుగురు సభ్యుల కమిటీ.. రథంలోని సింహాల మాయంపై విచారణ చేయనున్నారు. ఫెస్టివల్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్లతో పాటు అనుబంధ విభాగాల్లోని సిబ్బందిని కమిటీ విచారించనుంది.

చంద్రబాబు సతీమణి చెబితేనే దుర్గగుడిలో క్షుద్రపూజలు:
వెండి సింహాల మాయంపై దుర్గగుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు స్పందించారు. ఈ ఘటనపై.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్నపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు సతీమణి చెబితేనే గతంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు జరిపారని ఆరోపించారు. మాయమైన 3 వెండి సింహాల విగ్రహాలు కూడా.. బుద్ధా వెంకన్న ఇంట్లోనే ఉన్నాయని అనుమానించాల్సి వస్తుందన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకాలు చేసినవారు.. ఈ ఘటనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. దుర్గగుడి ఘటనపై.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం ఆపాలన్నారు. అమ్మవారి ఆస్తులను కాపాడతామన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక.. రథాన్ని వాడలేదు:
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. దుర్గగుడి రథాన్ని వాడలేదన్నారు ఆలయ ఛైర్మన్ సోమినాయుడు. లాక్ డౌన్ వల్ల ఊరేగింపులు రద్దయ్యాయని చెప్పారు. 2016 తర్వాత టీడీపీ హయాంలో ఘాట్ రోడ్డులో ఉన్న రథాన్ని తీసుకెళ్లి జమ్మిదొడ్డిలో పెట్టారన్నారు సోమినాయుడు. ఆ తర్వాత మహా మండపం కింద పెట్టారని తెలిపారు. టీడీపీ హయాంలో పాత ఈవో ఉన్నప్పుడు కప్పిన కార్పెట్‌ని.. ఇప్పటివరకు తాము తీయలేదన్నారు. అంతర్వేదిలో రథం కాలిపోయిన ఘటన తర్వాత.. దుర్గగుడి రథానికి కూడా భద్రత కల్పించాలనే తీశామన్నారు.

వీలైనంత త్వరగా కొత్త సింహాలు రెడీ:
ఆ సమయంలోనే.. 3 వెండి సింహాల ప్రతిమలు మాయమైనట్లు గుర్తించామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లో చెక్ చేసినప్పటికీ.. అక్కడ సింహాల విగ్రహాలు లేవన్నారు. మాయమైన సింహాల స్థానంలో.. కొత్తగా మరో 3 వెండి సింహాలు తయారు చేయిస్తున్నట్లు చెప్పారు సోమినాయుడు. వీలైనంత త్వరగా విగ్రహాల తయారీ పూర్తి చేయిస్తామన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ.. విగ్రహాలు తయారు చేయిస్తామని ఈవోకి లిఖితపూర్వకంగా ఇచ్చారని తెలిపారు ఛైర్మన్ సోమినాయుడు.

మాయమైన మూడు సింహాల విలువ రూ.15లక్షలు:
అంతర్వేది రథం దగ్ధం ఘటన మరువక ముందే బెజవాడ కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. ఒక్క సింహం విగ్రహం మాత్రమే మిగిలింది. దానిని కూడా పెకలించేందుకు ప్రయత్నించి.. విఫలమైనట్లుగా కనిపిస్తోంది. దుర్గగుడి ప్రాంగంణంలోనే ఉన్న వెండి రథానికి ఉన్న సింహాలు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. మాయమైన మూడు వెండి సింహాల విలువ దాదాపు 15 లక్షల రూపాయలు.

రూ.50లక్షల ఖర్చుతో 20ఏళ్ల క్రితం వెండి రథం తయారీ:
కనకదుర్గ అమ్మవారిని ఉగాది రోజున వెండి రథంపై ఊరేగిస్తారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఈ వెండి రథాన్ని తయారు చేయించారు. సుమారు 70 కేజీలకుపైగా వెండితో ఈ రథానికి తాపడం చేశారు. దీని కోసం అప్పట్లోనే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రథం నాలుగు స్తంభాలకు నాలుగు వెండి సింహాల విగ్రహాలను అమర్చారు. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండిని తాపడం చేసినట్లు సమాచారం. ఇప్పుడు 3 సింహాలు మాయమయ్యాయి. అంటే, మొత్తం 24 కేజీల వెండి చోరీకి గురైనట్లు తెలుస్తోంది.

కరోనా లాక్ డౌన్ సమయంలోనే చోరీ:
రథం దుర్గగుడి ఆవరణలో.. సమాచార కేంద్రానికి సమీపంలోనే ఉంది. ఇక్కడ సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినప్పటికీ.. సింహాలు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే చోరీ జరిగినట్లు భావిస్తున్నా రు. రథానికి టార్పాలిన్‌ పట్టాతో అధికారులు కప్పి ఉంచడంతో ఈ విషయం బయటపడలేదు. టార్పాలిన్‌ను తొలగించడంతో విగ్రహాల మాయం విషయం బయటపడింది.