Chittoor District: పొదుపు పేరుతో మోసం.. మహిళలను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు

చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్‌గా మోసాలకు దిగుతోంది ఓ ముఠా.

10TV Telugu News

Chittoor District: చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్‌గా మోసాలకు దిగుతోంది ఓ ముఠా. సెంథిల్ కుమార్, రాజ్ కుమార్, సంగీత అనే వ్యక్తులు జట్టుగా మీనా ఫైనాన్స్ కంపెనీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన కార్యాలయం ఉన్నట్లు తప్పుడు చిరునామా చూపించి మహిళలను బురిడీ కొట్టించారు కేటుగాళ్లు.

కూలి చేసుకుని కూడబెట్టుకున్న సోమ్మును పొదుపు చేస్తే, బ్యాంకు అకౌంట్లు క్రియేట్ చేసి లోన్లు ఇస్తామంటూ నమ్మించి నట్టేట ముంచేశారు. పొదుపు పేరుతో డబ్బులు మింగేసి, విషయం వెలుగులోకి వస్తుందని ముందే గ్రహించి ఊడాయించారు. స్వయం సహాయక సంఘాలకు సహాయం పేరుతో వీరంతా మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీ, సత్యవేడు, బి.ఎన్ కండ్రిగ, ప్రాంతాలకు చెందిన పేద మహిళలకు ఆర్థిక సహాయం పేరుతో వడ్డీ లేకుండా ఒక్కో గ్రూపుకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేస్తామని చెప్పి, శ్రీకాశహస్తీ, సత్యవేడు మండలాల్లో పలు గ్రామాల్లో కరపత్రాలు కూడా పంచారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కో గ్రూప్ నుంచి 10 నుంచి 15 వేలు దండుకున్నారు. బాధితుల నుంచి ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్‌లను తీసుకుని సంగీత, రాజ్ కుమార్ పేర్లతో ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఖాతాల్లో నగదు వేయించున్నారు.

పొదుపు సంఘాలు మాదిరిగానే ఉండడంతో మహిళలు కూడా నమ్మి, పది మంది, పది మంది గ్రూపుగా చేరారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ గడప తొక్కారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సంస్థ నిర్వహకుల కోసం గాలిస్తున్నారు.