వరదొస్తే ముప్పే : అమరావతిపై హెచ్చరించిన చెన్నై ఐఐటీ

  • Published By: madhu ,Published On : January 13, 2020 / 03:51 AM IST
వరదొస్తే ముప్పే : అమరావతిపై హెచ్చరించిన చెన్నై ఐఐటీ

వరదలు వస్తే..అమరావతికి ముప్పేనంటోంది చెన్నై ఐఐటీ. రాజధానిలో 71 శాతం భూములపై కృష్ణా వరద ప్రభావం ఉంటుదని, రాజధాని భూముల్లో 2.5 నుంచి 5 మీటర్ల లోతునే భూగర్భ జలాలున్నాయని తేల్చింది. కృష్ణా నదిలో వరద ప్రవాహం..ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే..రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరి 71 శాతం ప్రాంతాన్ని ముంచెత్తుతుందని హెచ్చరించింది. రాజధాని ప్రకటనలతో ఇప్పటికే అట్టుడుకుతుండగా..తాజాగా చెన్నై ఐఐటీ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి గతంలో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ సర్కార్ ఎంపిక చేసిన ప్రాంతంపై ఐఐటీ చెన్నై ఇటీవలే అధ్యయనం చేసింది. అమరావతి నిర్మాణం చేపట్టిన 29 గ్రామాల్లో కనీసం 71 శాతం అంటే..21 శాతం గ్రామాలపై కృష్ణా నది వరదలు తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. భూములన్నీ నల్లరేగడి కావడంతో 2.5 నుంచి 5 మీటర్ల లోతులోనే భూగర్భ జలాల లభ్యత ఉందని, అందువల్ల ఇక్కడ భవన, రహదారుల నిర్మాణం కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపింది.

ప్రభుత్వ భవనాల సముదాయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీల పనులు చేపట్టనున్న ప్రాంతాలపై వరదల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ భూముల్లో భవనాలను కన్స్‌స్ట్రక్షన్ చేయడానికి ర్యాఫ్ట్ ఫౌండేషణ్ పనికి రాదంది. ఇక నిర్మాణాల విషయానికి వస్తే..పైల్ ఫౌండేషన్ అవసరం అభిప్రాయం వ్యక్తం చేసింది. పైల్ ఫౌండేషన్ విధానంలో పునాదుల నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని, ఇది భవన నిర్మాణ వ్యయాన్ని రెట్టింపు చేస్తుందని తెలిపింది.

ఇక రహదారుల నిర్మాణానికి కూడా ఇదే విధానాన్ని అవలింబించాల్సి వస్తుందని, కనీసం 3-4 మీటర్ల ఎత్తున మట్టి నింపి, అభివృద్ధి చేయాలని..ఇందుకు భారీగానే డబ్బులు ఖర్చు అవుతాయంది. ముంపు ప్రాంతంలోని నిర్మాణాలకు అనుకూలంగా లేని భూముల్లో రాజధాని నిర్మించడం క్షేమకరం కాదని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా ఇదే రీతిలో నివేదికలు ఉండడం గమనార్హం. 

ఇటీవలే సీఎం జగన్..మూడు రాజధానులంటూ అసెంబ్లీ ప్రకటన చేయడం, GN RAO కమిటీ నివేదికపై రాజధాని ప్రాంత వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దూ అంటు ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా చెన్నై ఐఐటీ హెచ్చరికలపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. 

Read More : Special Study Offers : 10th స్టూడెంట్స్ కోసం దిల్ కుష్, సమోసా, జిలేబీ