నిషేధించినా : ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన కోడి పందాలు

నిషేధించినా : ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన కోడి పందాలు

Chicken races started in both the Godavari districts : ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలవడంతో కోళ్ల పందాల జోరు మళ్లీ మొదలైంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కోడిపందాలు ఆగడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా సీసలిలో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు కోడి పందాలు ప్రారంభించారు. పందెం రాయుళ్లు బరుల దగ్గరకు చేరుకుంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభం అయ్యాయి…సంక్రాంతి సంప్రదాయ కోడి పందాల పేరుతో ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీసలిలో పందాలను ప్రారంభించారు…కోడి పందాలు జరుగుతాయని ధీమాగా ఉన్న పందెం నిర్వాహకులు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు…ఇప్పటికే పందెం రాయుళ్లు బరుల వద్దకు చేరుకుంటున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల కోడి పందాలు మొదలవగా…మరికొన్ని చోట్ల పందాలు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు నిర్వహకులు.

ఇప్పటికే పెద్ద ఎత్తున కోడి పందాల కోసం పందెం రాయుళ్లు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. కోళ్ల పందాలు అంటే మామూలు కాదు. కొందరు కోళ్ల పందాలు మామూలుగా నిర్వహిస్తారు. మరికొందరు మామూలు కోళ్ల పందాలతో కిక్ ఏముంటుందంటూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తుంటారు. వారి ఆట కట్టించేందుకు పోలీసులు కోడికత్తుల తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో కోడికత్తుల తయారీ స్థావరంపై దాడి చేశారు. ఆత్కూరులోని ఓ కర్మాగారంపై దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 700 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోడి కత్తుల తయారీ కోసం వినియోగించే సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

కోడి పందాలకు ఫేమస్ అయిన జిల్లాల్లో కూడా ఈ కోడి కత్తుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కోళ్ల కత్తులను తయారు చేస్తున్న సంస్థల నిర్వాహాకులతో పాటు… కోళ్లకు కత్తులు కట్టే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోడి కత్తులకు సంబంధించి 150కి పైగా కేసులు నమోదు చేశామని, అనుమానం ఉన్నవారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెట్టినట్టు తెలిపారు.