Hindupur Anna Canteen : రూ.2కే చికెన్ రైస్.. హిందూపురం అన్న క్యాంటీన్‌లో సండే స్పెషల్

హిందూపురంలో మాత్రం అన్న క్యాంటీన్.. సండే స్పెషల్ వంటకాలతో ఘుమఘుమలాడింది. క్యాంటీన్ ప్రారంభించి వంద రోజులు పూర్తి కావడంతో 2 రూపాయలకే చికెన్, మసాల రైస్, పప్పన్నం, స్వీట్ పెట్టారు. పేదలకు టీడీపీ నాయకులు స్వయంగా వంటలు వడ్డించారు.

Hindupur Anna Canteen : రూ.2కే చికెన్ రైస్.. హిందూపురం అన్న క్యాంటీన్‌లో సండే స్పెషల్

Hindupur Anna Canteen : ఏపీలో అన్న క్యాంటీన్ల విషయంలో రాజకీయ రగడ కొనసాగుతోంది. అన్న క్యాంటీన్ల కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వైసీపీ, టీడీపీ మధ్య అన్న క్యాంటీన్ల వ్యవహారం చిచ్చు రాజేసింది. ఇరు పార్టీల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

ఇది ఇలా ఉంటే.. హిందూపురంలో మాత్రం అన్న క్యాంటీన్.. సండే స్పెషల్ వంటకాలతో ఘుమఘుమలాడింది. క్యాంటీన్ ప్రారంభించి వంద రోజులు పూర్తి కావడంతో 2 రూపాయలకే చికెన్, మసాల రైస్, పప్పన్నం, స్వీట్ పెట్టారు. పేదలకు టీడీపీ నాయకులు స్వయంగా వంటలు వడ్డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ తో పాటు ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య పథకం కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర మే నెలాఖరులో అన్న క్యాంటీన్‌ ను ప్రారంభించారు. ఆ క్యాంటీన్ వంద రోజులు పూర్తి చేసుకుంది. పేదలకు 2 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారు. 100 రోజులు పూర్తయిన సందర్భంగా పేదలకు ప్రత్యేక భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించారు. ఈ క్రమంలోనే చికెన్, మసాల, గుడ్డు, ఒక స్వీటు వడ్డించారు.

అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు రూ. 2కే భోజనం అందిస్తున్నామని బాలకృష్ణ భార్య వసుంధర తెలిపారు. బాలకృష్ణతో పాటు అమెరికాలో ఉంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారని ఆమె చెప్పారు. తన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ క్యాంటీన్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రూ. 2కే భోజనం ఇవ్వడం ఈ అన్నా క్యాంటీన్ ప్రత్యేకత. ఇలాంటిది ఎక్కడా చూసి ఉండరు. హిందూపురంలోనే ఇది సాధ్యమైంది. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుంటుంది” అని వసుంధర చెప్పారు.

కాగా, ఇటీవల తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. అన్న క్యాంటీన్ నిర్వహణతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. నోటీసులు ఇచ్చిన గంట వ్యవధిలో అన్న క్యాంటీన్ తొలగించమనడం సరికాదన్నారు. అదే ప్రాంతంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. అయితే దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు బలవంతంగా అన్న క్యాంటీన్ తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

అన్న క్యాంటీన్ల తొలగింపుపై నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. అన్నం తినే వారెవరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని అన్నారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అన్న క్యాంటీన్లను అడ్డుకున్నారని, ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ కు మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరతామని, పేద వాళ్ల ఆకలి తీరుస్తామని లోకేశ్ తేల్చి చెప్పారు.