చిలకలపూడిని ఆక్రమించిన చైనా మార్కెట్

చిలకలపూడిని ఆక్రమించిన చైనా మార్కెట్

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తి దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమం పెద్ద ఎత్తున మొదలైంది. చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని మనం భయపడుతున్నాము. కానీ అనేక రంగాల్లో చైనా ఉత్పత్తులు మన మార్కెట్ ను కబ్జా చేసేశాయి. అందులో మచిలీపట్నంలో ప్రసిధ్ది గాంచిన చిలకలపూడి రోల్డ్ గోల్డ్ పరిశ్రమను కూడా చైనా ఆక్రమించేసింది.

శతాబ్దకాలానికి పైగా దేశవిదేశాల్లో పేరుపొందిన చిలకలపూడి రోల్డ్ గోల్డ్ పరిశ్రమ డ్రాగన్ రాకతో కుదేలైంది. ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన చిలకలపూడి బంగారం కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ మార్కెట్లకు ఇమిటేషన్‌ నగలు అందిస్తోంది.

గాజులు, వడ్డాణాలు, చెవి దిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, పాపిడి బిళ్లలు, జడగంటలు, దేవతా విగ్రహాలకు కిరీటాలు, హారాలు, గొలుసులు, వంకీలు, పట్టీలు, మాటీలను వేలాది డిజైన్లలో తయారు చేసే నిపుణులకు ఇక్కడ కొదవలేదు.

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 10 వేల కుటుంబాలకు చెందిన దాదాపు 45 వేల మందికి పైగా కార్మికులు వీటి తయారీపై జీవనోపాధి పొందుతున్నారు. మచిలీపట్నంలోని పోతేపల్లి జ్యువెలరీ పార్కులో మొత్తం 236 పరిశ్రమలున్నాయి.

వీటికి అనుబంధంగా మచిలీపట్నం, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు, మొవ్వ తదితర ప్రాంతాల్లో వేలాది మంది ఇళ్ల వద్ద నగలకు రాళ్లు అద్దడం, మంగళ సూత్రాలకు మెరుగులు అద్దడం, పూసల దండలు చుట్టడం వంటి వివిధ రకాల పనులు చేస్తుంటారు. ఇక్కడ తయారైన ఆభరణాలకు 6 నెలలు నుంచి రెండు, మూడేళ్ల వరకు గ్యారంటీ ఇచ్చి మరీ విక్రయిస్తుంటారు వ్యాపరస్తులు.

గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ఇమిటేషన్‌ నగలపై కన్నేసిన డ్రాగన్‌ క్రమంగా చిలకలపూడి పరిశ్రమను కబ్జా చేసింది.మచిలీపట్నం ప్రాంతంలో నెలకు సగటున రూ.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ.80 కోట్ల విలువైన ఇమిటేషన్‌ నగలు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం చిలకలపూడి నగల మార్కెట్‌లో ఏకంగా 60 శాతం చైనా ప్రమేయం ఉంటే.. కేవలం 40 శాతం మాత్రమే స్థానికత ఉంది.

నాణ్యత మాటెలా ఉన్నా ధర తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా వ్యాపరస్తులు చెపుతున్నారు. చైనా ఉత్పత్తులకు ముందుగానే డబ్బు చెల్లించాల్సి రావటంతో లాభాలు తగ్గిపోయాయని వ్యాపరస్తులు వాపోతున్నారు.

చైనా సరుకులు తక్కువ ధరకు వస్తున్నాయనే దిగుమతి చేసుకుంటున్నామని… 60 శాతం చైనా సరుకులు మన మార్కెట్‌ను ఆక్రమించాయని వారు తెలిపారు. అవే ధరలకు మన దేశీయ మార్కెట్‌లో ముడి సరుకుల ఉత్పత్తి జరిగితే చైనా సరుకుల్ని బహిష్కరించవచ్చని వారు చెపుతున్నారు.