గుప్త నిధుల పేరుతో రూ.25 లక్షల మోసం : అయిదుగురు అరెస్ట్, రూ.9 లక్షలు రికవరీ

  • Published By: murthy ,Published On : October 10, 2020 / 11:14 AM IST
గుప్త నిధుల పేరుతో రూ.25 లక్షల మోసం : అయిదుగురు అరెస్ట్, రూ.9 లక్షలు రికవరీ

chittoor police arrest : గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న
అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన ఐదుగురు సభ్యులను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి రూ 9 లక్షల నగదు స్వాధీన పరచుకొన్నట్లు పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ తెలిపారు. చెన్నైకి చెందిన రాధిక అలియాస్ తులసి, గుంటూరుకు చెందిన అశోక్ తో పరిచయం ఏర్పరచుకొంది.

వీరిద్దరూ కలిసి విజయవాడలోని అశోక్ స్నేహితుడైన భాస్కర్ రెడ్డి అతని భార్య రాధిక లకు ఫోను చేసి తమకు గుప్త నిధులు దొరికాయని….వాటి విలువల రూ.50 లక్షల దాకా ఉంటుందని చెప్పారు. తమకు ఇప్పడు అత్యవసరంగా డబ్బు అవసరం కనుక ఆ నిధుల్లో దొరికిన బంగారాన్ని రూ.25 లక్షలకే విక్రయిస్తామని చెప్పారు.



దీంతో ఆశపడ్డ దంపతులు బంగారాన్ని కొనేందుకు 2020, మార్చి 7న పీలేరులో ఉన్న వారపు సంతకి వచ్చారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ముఠా సభ్యులు మంచి బంగారాన్ని భాస్కర్ రెడ్డి కి ఇచ్చి పరిశీలించు కోవాల్సిందిగా కోరారు.

దుండగులు ఇచ్చిన బంగారాన్ని తీసుకెళ్లి పరీక్షించగా అసలు బంగారంగా తేలడంతో భాస్కర్ రెడ్డి దంపతులు మార్చి 15వ తేదీన 25 లక్షల రూపాయలతో పీలేరు చేరుకొని ముఠా సభ్యులు ఇచ్చిన నకిలీ బంగారాన్ని తీసుకెళ్లి తిరిగే విక్రయించేందుకు ప్రయత్నించి మోసపోయినట్లు గుర్తించారు.



దీంతో ఖంగుతిన్న దంపతులు విజయవాడ పోలీస్ లను ఆశ్రయించగా ఎక్కడ మోసపోయారు ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించడంతో మే నెల 25వ తేదీన పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సి ఐ సాధిక్ అలీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించిన పీలేరు ఎస్ ఐ శివ కుమార్ పీలేరు సమీపంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా కు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్టు చేసి వారి నుండి రూ తొమ్మిది లక్షల నగదును స్వాధీనపరచుకొన్నట్లు వివరించారు.