అనీల్ ప్రచారంలో అలీ: మంత్రి నారాయణపై విమర్శలు

  • Published By: vamsi ,Published On : April 7, 2019 / 07:25 AM IST
అనీల్ ప్రచారంలో అలీ: మంత్రి నారాయణపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినిమా తారల రాజకీయ ప్రచారం సందడి నెలకొంది. ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గూటికి చేరిన స్టార్ కమెడియన్ అలీ కూడా తాజాగా నెల్లూరులో ప్రచారం నిర్వహించారు. నెల్లూరు సిటీ అభ్యర్ధిగా వైసీపీ తరుపున నిలబడ్డ అనీల్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న అలీ.. నగర ప్రజల సమస్యల పరిష్కారంకు నిజాయితీగా పోరాటాలు చేసిన అనీల్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.  పేదవారి కోసం సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అనీల్‌ను మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకుని ఆశీర్వదించాలని అన్నారు.

అలాగే మైనార్టీల సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తామని జగన్ ప్రకటించారని అలీ అన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఆర్థికంగా సాయం చేస్తామని, ఇమామ్, మౌజన్‌లకు గౌరవవేతనం రూ.15 వేలకు పెంచుతామని జగన్ తన మేనిఫెస్టోలో ప్రకటించారని అన్నారు. మ్యానిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందని, జగన్ వస్తే మంచి జరుగుతుందని అన్నారు. మంత్రిగా ఉండి కూడా నారాయణ నాలుగన్నరేళ్లుగా నగర ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును నారాయణ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని, ప్రతిఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటేయాలని కోరారు.