YSR Kalyanamastu : కల్యాణమస్తు పథకానికి టెన్త్ పాస్ నిబంధన మస్ట్.. ఎందుకో చెప్పిన సీఎం జగన్

YSR కళ్యాణమస్తు పథకానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అందులో ప్రధానమైనది టెన్త్ పాస్. ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలి.

YSR Kalyanamastu : కల్యాణమస్తు పథకానికి టెన్త్ పాస్ నిబంధన మస్ట్.. ఎందుకో చెప్పిన సీఎం జగన్

YSR Kalyanamastu : ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం అందేలా, లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటోంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో ఒకటి కళ్యాణమస్తు స్కీమ్. ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చింది.

కాగా.. YSR కళ్యాణమస్తు పథకానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అందులో ప్రధానమైనది టెన్త్ పాస్. ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. ఈ నిబంధన విధించడానికి కారణం ఏంటో వివరించారు సీఎం జగన్. బాల్య వివాహాలను కట్టడి చేసేందుకే కళ్యాణమస్తు పథకానికి టెన్త్‌ క్లాస్‌ నిబంధన విధించామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అందుకే వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా 10 వ తరగతి పాస్ అవ్వాలనే రూల్ పెట్టినట్లు వెల్లడించారు.

మహిళా శిశు సంక్షేమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బాల్య వివాహాల అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణలో కల్యాణమస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. అందులో భాగంగానే, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లిచేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలన్న నిబంధన తీసుకొచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

పేద ప్రజలు, అణగారిన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం YSR కళ్యాణమస్తు పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు, ఎస్సీల కులాంతర వివాహాలకు లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. అదే ఎస్టీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు, ఎస్టీల కులాంతర వివాహాలకు లక్ష 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద 50వేలు, బీసీలో కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు ఇవ్వనున్నారు. మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు, దివ్యాంగులు వివాహాలకు లక్షన్నర, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు 40 వేల రూపాయలు ఇవ్వాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.