విజయవాడ టీడీపీలో కోల్డ్ వార్.. పశ్చిమలో 39వ డివిజన్ అభ్యర్థిపై వివాదం

విజయవాడ టీడీపీలో కోల్డ్ వార్.. పశ్చిమలో 39వ డివిజన్ అభ్యర్థిపై వివాదం

Class struggle in TDP in Vijayawada : మున్సిపల్ ఎన్నికల ముందు విజయవాడలో టీడీపీకి వర్గపోరు తలనొప్పిగా మారింది. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ టీడీపీలో వర్గ పోరు మరింత ముదురుతోంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమలో 39వ డివిజన్ అభ్యర్థిపై వివాదం నడుస్తోంది. బుద్దా వెంకన్న, కేశినేని నాని వర్గం మధ్య వివాదాలు వెలుగు చూశాయి. 39వ డివిజన్ అభ్యర్థినిగా గుండారపు పూజితకు టీడీపీ బీ ఫారమ్‌ ఇచ్చిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గం చెబుతుంటే.. ఎంపీ కేశినేని వర్గం అభ్యంతరం తెలుపుతోంది. అంతేకాకుండా ఇరు వర్గాలు తమ అభ్యర్థులతో ప్రచారం చేస్తుండడంతో వివాదం మరింత హీటెక్కింది. దీంతో 39వ డివిజన్ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది.

ఎవరికి వారు తమ అభ్యర్థులతో ప్రచారం చేస్తుండటంతో అధిష్టానం గట్టి వార్నింగ్ ఇచ్చింది. బహిరంగ వేదికలపై పార్టీని విమర్శించినా, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా సహించేది లేదంటూ టీడీపీ అధిష్టానం నేతలను హెచ్చరించింది. పరస్పర విమర్శలతో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నేతలు కూడా వ్యక్తిగతంగా నష్టపోతారని భావిస్తున్న హైకమాండ్‌.. ఈ అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిర్ణయం తీసుకునేంతవరకు సంయమనం పాటించాలని ఆదేశించింది.

పార్టీ ఆదేశాలతో 39వ డివిజన్ అభ్యర్థి విషయంలో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాతో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చర్చించారు. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని.. బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని సూచించారు. త్వరలోనే అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అధినేతకు వివరించామన్నారు బుద్దా వెంకన్న. 39వ డివిజన్ అభ్యర్థినిగా పూజితకు బీ ఫారమ్ ఇచ్చామని.. ఆమెను అభ్యర్థినిగా ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

పార్టీలో విభేదాలు లేవని.. ఎవరైనా పార్టీ విజయం కోసం కృషి చేయాల్సిందేనని మరో సీనియర్ నేత జలీల్ ఖాన్ అన్నారు. మేయర్ అభ్యర్థి విషయంలో కూడా ఎవరూ ప్రకటన చేయలేదని.. హైకమాండ్ నిర్ణయం మేరకే తామూ నడుచుకుంటామని చెప్పుకొచ్చారు. రెండు వర్గాల మధ్య వార్‌తో కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.