ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రధాని మోదీతో సీఎం జగన్

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రధాని మోదీతో సీఎం జగన్

cm jagan special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం జగన్ ..విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని బేషరతుగా పార్లమెంట్‌లో ప్రకటించినట్టు గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 6వ నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ సహా పలు రాష్ట్రాల సీఎంలు, నీతి ఆయోగ్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్, ఆర్థికాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు. అదే సమయంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రస్తావించారు.

కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అర్ధవంతమైన చర్చ జరగాలని జగన్ అన్నారు. భారత్‌ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని కోరారు. ‘‘5 రకాల అంశాలు తయారీ రంగానికి అవరోధాలుగా మారాయి. రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్ ఖర్చులు అధికంగా ఉండటం భూసేకరణలో ఆలస్యం వంటి అంశాలు తయారీ రంగానికి అవరోధంగా మారాయి. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై ప్రభుత్వం ఏడాదికి 10 నుంచి 11 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతం మించి ఉండటం లేదు. రుణాలపై అధిక వడ్డీలు, విద్యుత్‌ ఖర్చులు భారంగా ఉన్నాయి’’ అని సీఎం జగన్ చెప్పారు. మంచి పనితీరు కనబరుస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని వెల్లడించారు.

కేంద్రం నిర్దేశించిన సంస్కరణల విషయంలో ముందుకెళ్తున్నామని సీఎం జగన్‌ వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 5 రకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించడంతో పాటు నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగు మందులను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. పంటల స్టోరేజీ, గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌ లో కొత్త టెక్నాలజీని తీసుకు రావాల్సి ఉందన్నారు. రైతులు తమ పంటలను సరైన ధరలకు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

రైతులు తమ పంటలను సరైన ధరకు ఫాంగేట్‌ వద్దే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిద్వారా ఆదుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయిన పక్షంలో సకాలంలో వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. రైతులకు సహాయకారిగా, అండగా ఉండేందుకు రాష్ట్రంలో 10,731 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే మల్టీ పర్పస్‌ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.