నో కాంప్రమైజ్.. తాడో-పేడో తేల్చుకునేందుకు జగన్, కేసీఆర్ రెడీ.. రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 12:32 PM IST
నో కాంప్రమైజ్.. తాడో-పేడో తేల్చుకునేందుకు జగన్, కేసీఆర్ రెడీ.. రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ

cm jagan cm kcr water dispute: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై రగడ రేగుతోంది. దీంతో రేపు(అక్టోబర్ 6,2020) జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో తాడో-పేడో తేల్చేందుకు ఇద్దరు సీఎంలు సిద్ధమయ్యారు. నీటి పంపకాల విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని గట్టిగా చెబుతున్నారు.

అన్యాయాలను నిలదీయాలని తెలంగాణ నిర్ణయం:
నాలుగేళ్ల తర్వాత జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఏపీ తీరును తప్పుబడుతూ.. తమకు జరుగుతున్న అన్యాయాలను నిలదీయాలని తెలంగాణ భావిస్తోంది.

అలాగే నీటి పంపకాల్లో కేంద్రం తీరును ఎండకట్టనుంది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ నష్టపోతుందన్న కేసీఆర్ వాదనను తిప్పికొట్టాలని ఏపీ నిర్ణయించింది. రాష్ట్ర విభజన చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా నీటిని అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ.. ఏపీ పైనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదనలు వినిపించనుంది.

ఏపీ.. అదనంగా నీటిని వినియోగిస్తోంది:
నీటి వాడకానికి సంబంధించి ఏపీ వ్యవహరిస్తున్న తీరును కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని తెలంగాణ భావిస్తోంది. కేటాయించిన దానికంటే ఏపీ అదనంగా నీటిని వినియోగిస్తుందన్నది తెలంగాణ వాదన. గతేడాది(2019) ఏపీ తన వాటా 511 టీఎంసీల కంటే 680 టీఎంసీలు వాడుకుందని తెలంగాణ చెబుతోంది.

అలాగే పోతిరెడ్డిపాడు పెంపు.. సిమిలర్‌గా రాయలసీమ ప్రాజెక్టుతో పాటు, కాల్వల సామర్థ్యం పెంపు చేస్తే మరింత నీటిని తరలించే అవకాశం ఉందని వివరించనుంది. రాయ‌ల‌సీమ ప్రాజెక్టు ద్వారా ప్రతీరోజు 3 టీఎంసీలు త‌ర‌లిస్తే.. శ్రీశైలంలో నీరు ల‌భించే ప‌రిస్థితి ఉండ‌దన్నది తెలంగాణ అభిప్రాయం. దీంతో పాల‌మూరు-రంగారెడ్డి, క‌ల్వకుర్తి‌, డిండి ఎత్తిపోత‌ల‌ పథకాలు, మిష‌న్ భ‌గీర‌ధకు నీటి క‌ష్టాలు త‌ప్పవని తెలంగాణ వివరించనుంది.

అనుమతి తీసుకోకుండానే ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ:
అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డుల అనుమతి తీసుకోకుండానే తెలంగాణలో ప్రాజెక్టులు చేపట్టినట్లు ఏపీ ఆరోపించనుంది. అలాగే కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సామర్థ్యాన్ని పెంచిందని.. దీంతో 178.93 టీఎంసీల కృష్ణా జలాలను అక్రమంగా తెలంగాణ తరలిస్తోందని ఏపి ప్రభుత్వం గట్టిగా వాదించనుంది.

తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి కొత్తగా 22.37 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రణాళికతో పాటు. తుమ్మిళ్ల, భక్తరామదాస ఎత్తిపోతల పథకంతో 1.3 లక్షల ఎకరాలకు నీళ్లందించే చర్యలకు ప్రారంభించిందన్నది ఏపీ వాదన

నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అటు ఏపీతో పాటు కేంద్రం తీరును కూడా ఎండగట్టేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. దీంతో రేపు జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాడీ వేడీగా జరగనుంది. ఇటు కేంద్రం కూడా.. రెండు రాష్ట్రాలు పరస్పరం ఏకాభిప్రాయానికి రావాలని కోరుతోంది.

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు న్యాయం చేయాలి:
రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం జల వివాదాలను ఆరేళ్లుగా నాన్చుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రధానిని కలిసి తెలంగాణకు న్యాయం చేయాలని కోరాలన్నారు.