CM Jagan review : రోజూ 3 లక్షల మందికి వ్యాక్సిన్‌.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీఎం జగన్

ఏపీలోనూ కరోనా టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనాను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు.

CM Jagan review : రోజూ 3 లక్షల మందికి వ్యాక్సిన్‌.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీఎం జగన్

Cm Jagan Review

CM Jagan review on corona control measures : ఏపీలోనూ కరోనా టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనాను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. రోజుకు మూడు లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, విద్యాసంస్థల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు.

కరోనా నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో వ్యాక్సిన్‌కి అర్హులపైన వారిని గుర్తించాలని టీకా అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

ఏపీలో కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆ సంఖ్య భారీగా పెరిగింది. 500కి చేరువలో కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33వేల 634 కరోనా పరీక్షలు నిర్వహించగా… 492 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయింది.

ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 168 కోవిడ్ కేసులు గుర్తించారు. జిల్లాలోని రాజమండ్రిలో ఓ కాలేజీలో 163 మంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2వేల 616 మంది చికిత్స పొందుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలోని ఓ కాలేజీలో ఇప్పటివరకు 163మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఆ కాలేజీలో గత రెండు రోజులుగా వరుసగా 13, 10 కేసులు రాగా, సోమవారం(మార్చి 22,2021) ఒక్కరోజే 140మందికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన వారిని ఒక ప్రాంతంలో ఉంచి, ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా చేశారు.