వాళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదు, నంద్యాల ఘటనపై సీఎం జగన్ ఆవేదన

  • Published By: naveen ,Published On : November 11, 2020 / 02:35 PM IST
వాళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదు, నంద్యాల ఘటనపై సీఎం జగన్ ఆవేదన

cm jagan nandyal incident: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన బాధ కలిగించిందన్నారు సీఎం జగన్. ఘటన జరిగిన వెంటనే న్యాయపరంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసులనే అరెస్ట్ చేయించామని గుర్తు చేశారు. కాగా, టీడీపీకి చెందిన రామచంద్రరావు అనే లాయర్ బెయిల్ పిటిషన్ వేసి వాదించారని జగన్ చెప్పారు.

వాళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదన్నారు జగన్. ఈ కేసులో పోలీసులకు బెయిల్ వచ్చిందన్న జగన్, వారి బెయిల్ ను రద్దు చేయాలని సెషన్స్ కోర్టుని ఆశ్రయించినట్టు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరతామన్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ మండిపడ్డారు.

నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో ఆదివారం(నవంబర్ 8,2020) అరెస్ట్ అయిన నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌కు నంద్యాల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆయ‌న సెల్ఫీ వీడియో, ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. నిందితులు సోమశేఖర్‌రెడ్డి, గంగాధర్‌కు నంద్యాల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే నిందితులు బెయిల్ కోసం ఆశ్రయించగా, నంద్యాల కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.

పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య:
దొంగతనం చేయకపోయినా పోలీసులు త‌న‌ను వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక నవంబర్ 3న రైలు కింద పడి అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం సీరియస్ అయ్యింది. ఐజీ శంకబ్రత బాగ్చి, గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లతో ప్రాథమిక విచారణ చేయించింది. వీరు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా సీఐ, హెచ్‌సీలను ఆదివారం అరెస్టు చేశారు. ఇద్దరు అధికారుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేలా చూస్తామ‌ని ప్రభుత్వం హామీ ఇవ్వ‌గా… అరెస్ట్ అయిన మ‌రుస‌టి రోజే నిందితులకు బెయిల్ వచ్చింది. దీనిపై స‌లాం కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బెయిల్ మంజూరు చేసిన కోర్టు:
సోమవారం(నవంబర్ 9,2020) నంద్యాల జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో నిందితులను హాజరుపరిచారు పోలీసులు. ఐపీసీ సెక్షన్‌ 306 పై (ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరాల్లో నమోదుచేసే సెక్షన్‌ ఇది. ఇది నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌. నేరం రుజువయితే పదేళ్ల జైలు శిక్ష లేక జరిమానా.. లేక రెండూ కోర్టు విధించవచ్చు) సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో జడ్జి ప్రసన్నలత ముందు వాదనలు వినిపించారు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టయితేనే ఈ సెక్షన్‌ నమోదు చేయాల్సి ఉంటుందని వాదించారు. కానీ, అబ్దుల్‌ సలాం మృతి చెందకముందు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న సెల్ఫీ వీడియో పరిశీలిస్తే.. వారిని ఆత్మహత్య చేసుకోవాలని గానీ, రైలు కిందపడి చావాలని గానీ సీఐ సోమశేఖర్‌రెడ్డి చెప్పినట్టు అందులో లేదన్నారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తుండటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని మాత్రమే ఉందని వాదించారు. ఈ సెక్షన్‌ను తొలగించి బెయిల్‌ను మంజూరు చేయాలని కోరారు.
https://10tv.in/nandyal-family-suicide-why-did-abdul-salam-commit-suicide-what-happened/
బెయిల్ రద్దయ్యేలా చూడాలన్న సీఎం జగన్:
వారి వాదనలను పరిగణనలోకి తీసుకొని సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లకు న్యాయమూర్తి బెయిల్‌ను మంజూరు చేశారు. కాగా, వారిద్దరికీ మంజూరైన బెయిల్‌ రద్దయ్యేలాగా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు పైకోర్టులో అప్పీల్‌ చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి.