CM Jagan Focus On Kuppam : చంద్రబాబు కంచుకోటపై జగన్ కన్ను.. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహం

ఎదురే లేకుండా వరుసగా విజయం సాధిస్తున్న టీడీపీ అధినేతకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నికల్లో టీడీపీ కోటలు బీటలు పడేలా ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు కంచుకోటను మంచుకోటగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.

CM Jagan Focus On Kuppam : చంద్రబాబు కంచుకోటపై జగన్ కన్ను.. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహం

CM Jagan Focus On Kuppam : కుప్పం.. చిత్తూరు జిల్లాలో చారిత్రక పట్టణం. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఎదురే లేకుండా వరుసగా విజయం సాధిస్తున్న టీడీపీ అధినేతకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నికల్లో టీడీపీ కోటలు బీటలు పడేలా ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు కంచుకోటను మంచుకోటగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ కుప్పం నుంచే తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి డైరెక్షన్ లో యాక్షన్ ప్లాన్ కార్యరూపంలోకి వస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కుప్పం నియోజకవర్గ వైసీపీ నేతలతో భేటీ అయిన జగన్.. ఆ రోజు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.66కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

నియోజకవర్గాల వారీగా వైసీపీ సమీక్షలను ముందుగా కుప్పం నుంచే ప్రారంభించారు జగన్. నిధుల మంజూరును అక్కడి నుంచే మొదలు పెట్టారు. కుప్పం నుంచి చంద్రబాబు పలుసార్లు గెలిచినా నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది వైసీపీ. దీనిలో భాగంగానే గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెల్చుకుంది. ఇక అదే ఒరవడిని వచ్చే ఎన్నికల్లో కొనసాగించాలన్న పట్టుదలతో వైసీపీ నాయకత్వం ఉంది.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు నేడు అమలు, ఇళ్ల స్థలాల మంజూరు వంటివి ప్రస్తావిస్తోంది. ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లీనిక్, ఆర్బీకే ఏర్పాటు అంశాలను వివరిస్తోంది. అలాగే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించి చంద్రబాబు చేయలేని పనులను తాము చేసి చూపిస్తున్నాం అంటూ ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.

కుప్పం బ్రాంచ్ కెనాల్ పనిని ఏడాదిలోపు పూర్తి చేసి ప్రజల మనసు గెలుచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం పులివెందుల మాదిరిగానే చూస్తానన్న జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ టార్గెట్ గా సీఎం జగన్ తమ కొత్త మిషన్ ను చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచే మొదలుపెట్టారు జగన్. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పట్టున్న టీడీపీ నేతలను ఆకర్షించడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.

2019 ఎన్నికల్లో కుప్పం నుంచే చంద్రబాబుపై పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి ఓడిపోయారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి ఆయన కుమారుడు భరత్ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. భరత్ కు అన్ని విధాల అండదండలు అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇవ్వడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్ గా పని చేస్తున్నారు. మొత్తం మీద కుప్పంపై వైసీపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.