విశాఖకు సీఎం జగన్, గ్యాస్ లీక్ బాధితులకు పరామర్శ

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 03:59 AM IST
విశాఖకు సీఎం జగన్, గ్యాస్ లీక్ బాధితులకు పరామర్శ

విశాఖ జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌లో కంపెనీలో గురువారం(మే 7,2020) తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. వెయ్యి మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. గ్యాస్‌ లీకేజీ జరిగిన ప్రాంతానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. అంతకుముందు గ్యాస్ లీకేజీ ఘటనపై విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు సీఎం జగన్. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు.

గ్యాస్ లీకేజీ తగ్గడంతో ఆర్‌ఆర్‌ వెంకటాపురంతో పాటు చట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా గ్యాస్‌ లీకేజ్‌ అవడంతో గంగరాజు అనే స్థానికుడు ప్రాణ భయంతో పరుగులు తీస్తూ కళ్లు సరిగా కనిపించకపోవడంతో నేల బావిలో పడి మృతి చెందాడు. గ్యాస్ తీవ్రతకు పలు ప్రాంతాల్లో పశువులు మృతి చెందగా, చెట్లు, మొక్కలు నల్లగా మాడిపోయాయి.

తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. కేజీహెచ్‌తో పాటు విశాఖ కేర్‌, సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. 

విషవాయువు లీక్ తో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 5 గ్రామాలకు చెందిన వెయ్యి మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు లీక్ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిలో 20మంది పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీకి చుట్టుపక్కల ఉన్న ఆర్ ఆర్ వెంకటాపురం, కంపరపాలెం కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్, పద్మాపురం గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీక్ అయిన విషయవాయువును స్టెరైన్ గా(styrene) అధికారులు గుర్తించారు. ఈ గ్యాస్ మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. శ్వాస తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చర్మంపై దద్దుళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భయాందోళనకు గురైన స్థానికులు ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. సింహాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను తరలిస్తున్నారు.

Also Read | విశాఖలో భారీ ప్రమాదం.. విషవాయువు లీక్, ఇళ్లు వదిలి పరుగులు తీసిన ప్రజలు