ఏలూరులో వైద్యపరీక్షలపై సీఎం జగన్ ఆరా..బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

  • Published By: bheemraj ,Published On : December 8, 2020 / 02:44 PM IST
ఏలూరులో వైద్యపరీక్షలపై సీఎం జగన్ ఆరా..బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

CM Jagan inquire medical examinations : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితులకు అందిస్తున్న వైద్యపరీక్షలపై సీఎం జగన్ ఆరా తీశారు. రాష్ట్రంతో పాటు కేంద్రానికి చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలు అధికారులు సీఎంకు వివరించారు. ఎయిమ్స్ పరీక్షల్లో బాధితుల శరీరంలో సీసం, నికెల్ లాంటి మూలకాలు ఉన్నట్టు తెలిసిందని అధికారులు సీఎంకు తెలిపారు. బాధితులకు నిర్వహించిన పరీక్షలు, నీళ్లు, పాల శాంపిళ్ల నివేదికలు తనకు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతుచిక్కని వ్యాధిపై అధికారులతో రేపు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.



అంతకుముందు అంతుచిక్కని వ్యాధితో…ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ ఉదయం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన జగన్…బాధితుల పక్కనే కూర్చుని వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వ్యాధి లక్షణాలు, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరగంటకు పైగా ఆస్పత్రిలోనే గడిపిన జగన్…చిన్నారులు, మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.



పని చేస్తున్న వారు, గుడికి వెళ్లినవారు, ఇంట్లోవారితో మాట్లాడుతున్నవారు సడన్‌గా ఉన్నట్లుండి స్పృహతప్పి పడిపోతున్నారు. నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో ఇదే జరుగుతోంది. ప్రతీ ఒక్కరు చూస్తుండగానే కళ్లముందే ఫిట్స్ వచ్చినట్లు పడిపోతున్నారు. ఇలా ఇప్పటి వరకు 502మంది ఆస్పత్రుల్లో చేరారు. గంటగంటకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో 332మందిని డిశ్చార్జ్‌ చేయగా…. 153మంది చికిత్స పొందుతున్నారు.

మిగిలిన వారిని గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటిదాకా ఏలూరును వణికించిన ఈ అంతుచిక్కని మహమ్మారి… చుట్టు పక్కల ప్రాంతాలకూ విస్తరిస్తోంది.



దెందులూరు, నారాయణపురం, కొవ్వాలి, కైకలూరుతో పాటు కృష్ణాజిల్లా నూజివీడులోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. బాధితుల్లో కొందరు గర్భిణులు, ఆపరేషన్లు చేయించుకున్నవారు కూడా ఉన్నారు. పిల్లలు లేదు-పెద్దలు లేదు…..యువకులే కాదు ముసలి వాళ్లు కూడా అంతా దీని బారిన పడుతున్నారు. ఉన్నట్లుండి స్పృహ తప్పుతున్నారు. కొందరు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు.



మున్సిపల్ ట్యాంక్ నీళ్లే ఏలూరు కొంపముంచాయా? అందులో ప్రమాదకర పదార్ధాలు కలిశాయా? అంటే అవుననే అంటున్నాయి పలు కెమికల్ అనాలసిస్ సంస్థలు. తమ నివేదికల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాయి. ఏలూరులో నీటి శాంపిల్స్‌ను IICT, CSIR-NGRI పరీక్షించాయి. నీళ్లలో అధిక మోతాదులో క్లోరైన్, పాస్పైట్ పెస్టిసైడ్స్ ఉన్నట్లు గుర్తించాయి.



వాటర్ ట్యాంక్ సమీపంలోని పొలాల్లో ఎక్కువగా పాస్పైట్ పెస్టిసైడ్స్ వాడి ఉంటారని అది నీటిలో కలిసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. ప్రజలు ఉన్నట్టుండి పడిపోవడంపై ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసీటీ నివేదికలు ఇచ్చాయి. ఏలూరులో పరిస్థితికి లెడ్‌, నికెల్ కారణమని తేల్చాయి. బాధితుల రక్తంలో అధిక మోతాదులో లెడ్ హెవీమెటల్, నికెల్ ఉన్నట్లు స్పష్టం చేశాయి.