విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా…బాధితులకు వైద్య సహాయం అందించాలని ఆదేశం

  • Published By: bheemraj ,Published On : August 1, 2020 / 04:04 PM IST
విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా…బాధితులకు వైద్య సహాయం అందించాలని ఆదేశం

విశాఖ షిప్ యార్డు క్రేన్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ట్రయల్ రన్ చేస్తుండగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్ లో ఉన్న 10 మందితోపాటు మరొకరు మృతి చెందారు. విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వైద్య సహాయం అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని విశాఖ కలెక్టర్, సీపీని ఆదేశించారు.



ప్రమాద ఘటనపై ఐదుగురు సభ్యులతో హైలెవల్ కమిటీ వేశామని కలెక్టర్ తెలిపారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. క్రేన్ ప్రమాద ఘటనాస్థలిని కలెక్టర్ వినయ్ చంద్ సందర్శించారు. ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది చనిపోయారని తెలిపారు. ముంబైకి చెందిన అనుపమ్ కంపెనీ వాళ్లు క్రేన్ ను హిందుస్థాన్ కు అందించారని కలెక్టర్ చెప్పారు.

రెండేళ్లుగా ట్రయల్ రన్ లేకుండా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అనుపమ్ కంపెనీ ట్రయల్ రన్ చేయలేదని స్పష్టం చేశారు. గ్రీన్ ఫీల్డ్ సంస్థతో హిందుస్థాన్ షిప్ యార్డ్ ట్రయల్ రన్ కు సన్నాహాలు చేసిందని వెల్లడించారు. 10 టన్నుల నుంచి 50 టన్నుల వరకు లోడింగ్ ట్రయల్ చేశారని వివరించారు.



మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోయింది. క్రేన్ ను బిగిస్తుండగా కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్రేన్ కూలిపోయినప్పుడు ఘటనా స్థలంలో 18 మంది సిబ్బంది ఉన్నారు. కూలిపోయిన క్రేన్ కొత్తదని సిబ్బంది అంటున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. షిప్ యార్డ్ లో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీశారు. క్షతగాత్రుల్ని వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్టీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్ద రక్షణ శాఖ ఉద్యోగులు సహాయక చర్యలు చేపట్టారు.