ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్, సీఎం జగన్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో మరింత పారదర్శకంగా ఇసుక విక్రయాలు

  • Published By: naveen ,Published On : June 7, 2020 / 10:14 AM IST
ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్, సీఎం జగన్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో మరింత పారదర్శకంగా ఇసుక విక్రయాలు

* రాష్ట్రంలో మరింత పారదర్శకంగా ఇసుక విక్రయాలు
* సీఎం జగన్ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు
* ఆన్ లైన్ తో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ 
* దళారుల ప్రమేయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు
* పోర్టల్ ను ఎక్కువ సమయం తెరిచి ఉంచాలని నిర్ణయం
* 1 నుంచి 5, ఆపై ఆర్డర్ స్ట్రీంలలో కూడా ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక
* 5 కి.మీ. పరిధిలోని ప్రజల అవసరాలకు వెలుసుబాటు
* వర్షాకాలం కోసం 70లక్షల ఎంటీల ఇసుక నిల్వ లక్ష్యం
* రోజుకు 3 లక్షల ఎంటీల ఇసుక తవ్వకాలు జరపాలని లక్ష్యం
* అడిగిన వారందరికీ ఇసుక సరఫరా
* ఇసుక నాణ్యతను పరిశీలించేందుకు టెక్నికల్ టీమ్ లు
* ఇకపై జాయింట్ కలెక్టర్లకే బల్క్ బుకింగ్ ల బాధ్యత 
* భూగర్భ గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది.

రాష్ట్రంలో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. ఈ మేరకు జూన్ 5న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రకటించిన తర్వాత ఏపీఎండీసీ ద్వారా పారదర్శకతతో ఇసుక విక్రయాలను నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలోనే ఆన్ లైన్ విధానంలో ఇసుకను వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు ఉందన్నారు. కొత్త విధానం ద్వారా వినియోగదారులకు ఇసుకను అందిస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను కూడా గుర్తించి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అదే క్రమంలో ఇసుక మాఫియాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు రీచ్ లు, స్టాక్ పాయింట్లు, చెక్ పోస్ట్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, గనుల శాఖ, రెవెన్యూ, రవాణాశాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ద్వారా తనిఖీలు చేయడం ద్వారా అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండేళ్ల జైలుశిక్ష, 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టాన్ని చేసిందని తెలిపారు.

ఇకపై సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్:
ఇప్పటివరకు ఇసుక కావాల్సిన వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వారని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉన్న వారికే ముందుగా ఇసుక లభిస్తుండటంతో, పోర్టల్ ప్రారంభించిన కొద్దిసేపటికే బుక్ అవుతోందని అన్నారు. దీనివల్ల మిగిలిన వినియోగదారులకు ఇసుక బుకింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ లు నిర్వహించేందుకు జూన్ 5న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్నట్లయితే స్థానికంగా ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా నిజమైన అవసరానికే సదరు బుకింగ్ జరుగుతోందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, నిర్ధారించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. దీని వల్ల అవసరం లేని వారు కూడా ఇసుకను బుక్ చేసి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. 

స్థానికులకు ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుకకు అనుమతి:
రాష్ట్రంలో వాగులు, వంకలతో పాటు చిన్న నీటిపాయల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా స్థానికులు వాడుకునేందుకు వీలుగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. గతంలో వాగులు, వంకలకు చెందిన 1 నుంచి 3వ ఆర్డర్ స్ట్రీమ్ ల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుక తీసుకునే వీలుండేదని అన్నారు. తాజాగా ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నదులు, జలవనరులకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు తమ అవసరాల కోసం ఎడ్లబండ్ల ద్వారా తీసుకునే ఉచిత ఇసుక పరిధిని 4, 5 ఆ పై ఆర్డర్ స్ట్రీమ్ ల వరకు కూడా పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని అన్నారు. గుర్తించిన వాటర్ స్ట్రీమ్ ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఉచితంగా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీనివల్ల జలవనరుల సమీపంలోని ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని, ఇసుక బుకింగ్ లపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. 

రోజుకు 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు:
లాక్ డౌన్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలను మరింత వేగవంతం చేశామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిని అతి త్వరలోనే రోజుకు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. జూన్ 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,53,197 మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వి తీశామని, దానిలో డోర్ డెలివరీ ద్వారా 33,28,553 ఎంటిలు, ఇతర వినియోగదారులకు 53,57,003 ఎంటిలు అందించామని తెలిపారు. ఇక ఉపాధి హామీ పనుల కోసం 7,51,189 ఎంటిలు, నాడు-నేడు పనులకు 3,29,814 ఎంటిలు, బల్క్ బుకింగ్ లకు 21,47,386 మెట్రిక్ టన్నుల ఇసుకను రవాణా చేశామని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రానున్న వర్షా కాలం అవసరాల కోసం మొత్తం 75 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు.

జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వినియోగదారులు 48,99,916 టన్నులను బుక్ చేసుకోగా వారికి 46,20,217 టన్నులను రవాణా చేశామని తెలిపారు. కేవలం 5.7శాతం మాత్రమే వారికి పెండింగ్ ఉందన్నారు. అలాగే 16,70,678 టన్నుల బల్క్ బుకింగ్ కి గానూ 14,25,797 టన్నులు రవాణా చేశామని, ఇంకా పెండింగ్ లో కేవలం 2,44,540 టన్నులు మాత్రమే ఉందని వివరించారు.

ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు:
పర్యావరణ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఇసుక అందించే నదుల్లోని ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. ఇక్కడ యంత్రాలను, ఇసుకను బయటకు పంపేందుకు లారీలు, టిప్పర్లను ఉపయోగించేందుకు నిబంధనలు అంగీకరించని నేపథ్యంలో కూలీలతో తవ్వకాలు చేసి, ట్రాక్టర్ల ద్వారానే తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్లకు పంపుతున్నామని తెలిపారు. అయితే కోవిడ్-19 కి ముందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇసుక తవ్వకాల్లో ఎక్కువశాతం పనిచేశారని, లాక్ డౌన్ కారణంగా పనులు నిలిపివేయడంతో కూలీల్లో అధికశాతం తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. దీంతో ప్రస్తుతం స్థానికంగా వున్న కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. దీనివల్ల కూడా ఓపెన్ రీచ్ ల నుంచి వచ్చే ఇసుక నిల్వలు కొంత మందగించాయని అన్నారు. జిల్లాల్లోని కలెక్టర్ల ద్వారా తిరిగి ఇసుక తవ్వకాల్లో నైపుణ్యం ఉన్న వలస కూలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓపెన్‌ రీచ్ లలో కూడా ఇసుక తవ్వకాలను పెంచాలని అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, మైనింగ్, ఏపీఎండీసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఎక్కువ ఇసుకను తవ్వేందుకు, రీచ్ లలో ఆపరేషన్లు సక్రమంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
    
ప్రత్యేక బృందాలతో ఇసుకపై పూర్తి పర్యవేక్షణ:
ఇసుక ఆపరేషన్లపై జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. జిల్లాలో టెక్నికల్ టీంల ఆధ్వర్యంలో రీచ్ లు, పట్టా భూముల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పట్టా భూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తర్వాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఇకపై బల్క్ బుకింగ్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ల పర్యవేక్షణలోనే అనుమతించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.