మార్చి 8th..మహిళా దినోత్సవంనాడు మొబైల్ కొంటే మహిళలకు 10 శాతం డిస్కౌంట్..సీఎం జగన్ కీలక నిర్ణయాలు

మార్చి 8th..మహిళా దినోత్సవంనాడు మొబైల్ కొంటే మహిళలకు 10 శాతం డిస్కౌంట్..సీఎం జగన్ కీలక నిర్ణయాలు

March 8th CM Jagan Key Decisions  : మార్చి 8th..అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళ కోసం ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 8న మహిళలు మొబైల్ కొంటే వారికి 10 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమావేశమైన సందర్భంగా ఈ సూచనలు చేశారు. పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలకు ఆరోజు స్పెషల్‌ డే ఆఫ్‌ ఇవ్వాలని సూచించారు. అలాగే మహిళా ఉద్యోగులకు అదనంగా 5 క్యాజువల్‌ లీవ్స్‌.. అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్‌ చెకప్ వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

హోం, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మెప్మా తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం పలు అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 7న రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వాలని..దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2,000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దిశ యాప్‌ కోసం సెలక్ట్ చేసిన షాపింగ్‌ సెంటర్లలో మార్చి 8న మొబైల్‌ ఫోన్లు కొనుక్కునే మహిళలకు 10 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే..మహిళా భద్రత, సాధికారతపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని..పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉన్న ప్రతీ వింగ్‌ నుంచి విధులను సక్రమంగా నిర్వహించిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి వారిని సత్కరించాలని తెలిపారు. పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించనున్నారు.