దుర్గగుడి అభివృధ్ధి పనులకు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్

దుర్గగుడి అభివృధ్ధి పనులకు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్

CM Jagan ladi foundation stone development works in durga temple vijayawada : రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఒక దేవాలయం అభివృద్ధి పనుల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో ఆలయం అభివృద్ధి పనులకు రూ.70 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్‌ ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.70 కోట్లతో దుర్గ గుడివద్ద చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు చిన్న ఆలయం మొదలు పెద్ద దేవాలయాల వరకు ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా సొంత నిధులు (భక్తులిచ్చే కానుకలు) తోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమాత్రం ఆదాయం లేని ఆలయాలు శిధిలావస్థకు చేరితే జీర్ణోద్ధారణకు దేవదాయ శాఖ సీజీఎఫ్‌ (కామన్‌ గుడ్‌ ఫండ్‌) నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు.

అధిక ఆదాయం సమకూరే ఆలయాల నుంచి దేవదాయ శాఖ ఏటా నిర్ణీత మొత్తంలో సేకరించే మొత్తాన్ని సీజీఎఫ్‌గా వ్యవహరిస్తారు. శిధిలావస్థకు చేరిన ఆలయాల పునఃనిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేస్తుంది. అది కూడా ఇప్పటివరకు గరిష్టంగా రూ.ఐదు కోట్లకు మించి సీజీఎఫ్‌ నిధులు ఒక ఆలయానికి ఇచ్చిన ఉదంతాలు లేవని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.70 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించడం దేవదాయ శాఖ చరిత్రలో అపూర్వ ఘటనగా పేర్కొంటున్నారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్‌ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుండగా దీన్ని మభ్యపెడుతూ దేవదాయ శాఖ నిధులను మళ్లిస్తున్నారంటూ టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దుర్గ గుడి వద్ద అభివృద్ధి కార్యక్రమాల కోసం అమ్మవారి పేరిట ఉన్న బ్యాంకు డిపాజిట్లలో దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేసి ఆలయం చుట్టు పక్కల భూములను కొనుగోలు చేశారు.

ఈ భూముల కొనుగోలు ప్రక్రియలో స్థానిక టీడీపీ నేతలు భారీగా లబ్ధి పొందగా అమ్మవారి ఆలయ నిధులు పూర్తిగా అడుగంటాయి. శ్రీశైలం దేవాలయం విషయంలోనూ బాబు ఇలాగే వ్యవహరించారు. ఆలయం వద్ద ఉన్న నిధుల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా అభివృద్ధి పనులకు మంజూరు చేసి చివరకు అన్నదానం నిధులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టేందుకు గత సర్కారు పెద్దలు ప్రయత్నించారు.

అభివృధ్ది పనులకు శంకుస్ధాపన చేయటానికి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు , ఆలయ చైర్మన్ పైలా స్వామినాయుడు ఈఓ ఎమ్ సురేష్ బాబు స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ రాష్ట్రము లోని వివిధ ఆలయాలపై రూపొందించిన క్యాలండర్ ముఖ్య మంత్రి ఆవిష్కరించారు. దేవాదాయ శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలో టెంపుల్ టూరిజం పై ప్రత్యేక ద్రుష్టి సారించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు . రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో రూపొందించిన క్యాలెండరు ను ముఖ్యమంత్రి చూసి అధికారులను అభినందించారు .ఆయా దేవస్థానాల్లో నిర్వహించే వేడుకలను ప్రతిబంబించేలా క్యాలెండరు రూపొందించారు.