Bhogapuram Airport: నెరవేరనున్న ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ.. భోగాపురం ఎయిర్‌పోర్టు విశేషాలివే..
రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

Bhogapuram Airport sample
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరనోంది. రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి బుధవారం భోగాపురంలో శంకుస్ధాపన చేశారు. 2,203 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని కేవలం 24నెలల్లోనే పూర్తి చేస్తామని జగన్ చెప్పారు. ఈ విమానాశ్రయం పూర్తయితే ఏడాదికి 60లక్షల మంది ప్రయాణించేందుకు వీలు ఉంటుంది. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల కల్పన ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
భోగాపురం ఎయిర్‌పోర్టు విశేషాలు..
◊ భూసేకరణ, టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఎన్‌వోసీ, పర్మిషన్‌లు తీసుకొచ్చి ఎన్‌జీటీ, హైకోర్టు, సుప్రింకోర్టులలో న్యాయవివాదాలు పరిష్కరించి భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల ప్రారంభానికి శంకుస్థాపన జరిగింది.
◊ పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడిసీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది.
◊ ఈ విమానాశ్రయంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం. ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానం చేయనున్నారు.
◊ అంతర్జాతీయ ఎగ్జిమ్ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలిదశలో 5,000 చదరపు మీటర్లు విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ అభివృద్ధి చేస్తారు.
◊ విమానాశ్రయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్ నిర్మాణం చేయనున్నారు.
◊ 16వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్‌మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలు.
◊ విశాఖపట్నం – భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రహదారి నిర్మాణం. రెండువైపులా సర్వీసు రోడ్లు నిర్మాణం.
◊ ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో ఐదు వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా పర్యాటక అభివృద్ధి, ఇతర పెట్టుబడుల ద్వారా మరో ఐదు లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
◊ విమానాశ్రయంకోసం స్వఛ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన నాలుగు గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో ప్రభుత్వం పునరావాసం.