రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలి, సహాయ సహకారాలు అందివ్వాలి – బ్యాంకర్లతో సీఎం జగన్

  • Published By: madhu ,Published On : October 24, 2020 / 07:26 AM IST
రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలి, సహాయ సహకారాలు అందివ్వాలి – బ్యాంకర్లతో సీఎం జగన్

cm jagan meeting state level bankers : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న జగన్‌… రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలని బ్యాంకర్లను కోరారు. ప్రతి ఒక్కరి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని.. అన్ని పథకాలకు బ్యాంకర్లు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.



చిరు వ్యాపారుల కోసం వచ్చేనెలలో జగనన్న తోడు పథకం అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. వ్యవసాయం, మహిళల స్వావలంబన, పాఠశాలలు, ఆస్పత్రుల రూపు రేఖల మార్పునకు ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. కొవిడ్‌ సమయంలో నిధులకు కొరత లేకుండా బ్యాంకులు సహకరించాయని జగన్‌ అభినందనలు తెలిపారు.

ఆర్థిక రంగానికి వ్యవసాయం వెన్నెముకని.. రాష్ట్రంలో దాదాపు 62 శాతం ఆ
రంగంపైనే ఆధారపడ్డారని జగన్‌ తెలిపారు. అందుకే రైతు సంక్షేమం, అభివృద్ధికి పలు కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం బ్యాంకర్లకు వివరించారు.



https://10tv.in/big-relief-for-pawan-kalyan/
‘ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులు కోరిన 48 గంటల్లోనే వారి ఇంటివద్దకే అందించేలా కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు, ఈ-క్రాపింగ్‌ చేస్తున్నారు. ఇది రైతులకు ఎంతో మేలు చేకూరుస్తోంది. ఈ-క్రాపింగ్‌లో నమోదైన ప్రతి రైతుకు రుణాలు అందుతున్నాయా? లేదా? అన్నది బ్యాంకర్లు చూడాలి. 2020-21 ఏడాది ఖరీఫ్‌లో 75,237 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంటే… ఇప్పటి వరకు 62,650 కోట్లు పంపిణీ చేశాం. గత ఏడాది కంటే ఇది 3 వేల కోట్లు తక్కువ’ అని సీఎం జగన్ చెప్పారు.

ప్రతి గ్రామంలో గోదాములు, మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కోసం ప్రతి గ్రామంలో జనతా బజార్ల ఏర్పాటు చేయనున్నట్టు జగన్‌ తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం నాడు-నేడు చేపట్టామని.. దానికీ బ్యాంకర్లు సహాయం చేయాలన్నారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మహిళలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.



సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పూర్తిగా 1100 కోట్ల పారిశ్రామిక రాయితీ అందించినట్లు సీఎం వివరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నింటికీ బ్యాంకర్ల మద్దతు ఉండాలని, సహాయ సహకారాలు అందించాలని జగన్‌ కోరారు.