దిశ పోలీస్ స్టేషన్ : రాజమండ్రిలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం

మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం(disha act) సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 03:54 AM IST
దిశ పోలీస్ స్టేషన్ : రాజమండ్రిలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం

మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం(disha act) సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక

మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఇక ఇవాళ(ఫిబ్రవరి 08,2020) రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీసు స్టేషన్లను ప్రారంభించబోతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి దిశ పోలీసు స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్ నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

దేశంలో ఫస్ట్ టైమ్:
హైదరాబాద్‌ దిశ హత్యాచార ఘటనతో ఏపీలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటి పీఎస్‌ను రాజమహేంద్రవరంలో నిర్మించారు. ఇవాళ దీన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించనుండడంతో..  పీఎస్‌కు తుది మెరుగులు దిద్దారు. 

ఉదయం 10.30 గంటలకు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి… మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. వీటన్నింటినీ సీఎం జగన్… రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏపీలో మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

24 గంటలూ అందుబాటులో:
మహిళల రక్షణకు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘దిశ’ విభాగం ఏర్పాటు చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్‌ మహిళా మిత్రలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళలపై దాడులు, దిశ కేసుల్లో వేగవంతమైన విచరణ కోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకురుస్తున్నామని వెల్లడించారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీళ్లంతా 24 గంటలూ… మహిళల భద్రత కోసం పనిచేస్తారు. త్వరలో దిశ యాప్ కూడా ప్రవేశపెడతామని ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా ఆపదలో ఉన్న మహిళలు వెంటనే రక్షణ పొందేందుకు వీలవుతుందన్నారు. 

disha

 

రాజమండ్రిలో దిశ పోలీస్‌ స్టేషన్‌‌ను ప్రారంభించిన తర్వాత నన్నయ యూనివర్శిటీకి సీఎం జగన్ వెళ్తారు. అక్కడ దిశ వర్క్‌షాప్‌‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దిశ పోలీస్ స్టేషన్ల ప్రాధాన్యం వివరిస్తారు. అలాగే దిశ చట్టం పరిస్థితేంటి? ఎప్పటిలోగా అమల్లోకి వస్తుంది? దాని కోసం ఢిల్లీ స్థాయిలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నది జగన్ వివరించే అవకాశాలున్నాయ్.

21 రోజుల్లోనే దర్యాఫ్తు పూర్తి, శిక్ష:
మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం దిశ యాక్ట్‌ తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన దిశ చట్టం.. కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. దిశ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తోంది. ఈ చట్టంలోని కొన్ని అంశాలపై మరింత వివరణ కోరడంతో… ఆ వివరాల్ని కూడా కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చట్టం అమల్లోకి వస్తే… 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, దోషులకు 21 రోజుల్లోనే శిక్ష వేస్తారు. మహిళలకు భరోసా కల్పించేలా ఈ చట్టం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

* ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్ల ప్రారంభం
* రాజమహేంద్రవరంలో మొదటి దిశ స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం 
* దిశ చట్టం సమర్థంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు
* చట్టం అమల్లోకి వస్తే.. అత్యాచార కేసుల్లో 21 రోజుల్లోనే దర్యాఫ్తు పూర్తి, శిక్ష