అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేయాల్సిందే : సీఎం జగన్

పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 02:17 AM IST
అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేయాల్సిందే : సీఎం జగన్

పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సాగునీటి రంగంపై సమీక్ష జరిపిన సీఎం జగన్.. విశాఖకు నిరంతరం తాగునీరు సరఫరా చేసేలా పైపులైన్లు వేయాలన్నారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం కోరుతూ.. పేదలకు అండగా ఉండే బాధ్యత తీసుకోవాలన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు, కరవు బాధిత ప్రాంతాలకు జలాల తరలింపుపై సీఎం సమీక్షించారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు‌. పోలవరం పనులకు ఒక్క రోజు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి రాకూడదని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు వెళ్లే కాల్వల విస్తరణపై ప్రతిపాదనలను అధికారులు వివరించారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కరవు పీడిత ప్రాంతాలకు తరలింపుపైనా సీఎం సమీక్షించారు. గోదావరి నీటిని వయా బొల్లాపల్లి మీదగా బనకచర్లకు తరలించే ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా సీఎం సమీక్ష జరిపారు. విశాఖకు నిరంతరం తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

బ్యాంకర్లతోనూ సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వం, బ్యాంకులు ఒకేతాటిపైకి వస్తే మరిన్ని కార్యక్రమాలు చేయగలమన్నారు. కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని లెక్కలు చెబుతున్నాయన్నారు సీఎం జగన్. బ్యాంకర్లు, ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరిన్ని రుణాలు అందించేలా ముందడుగు వేయాల్సి ఉందన్నారు. రైతు భరోసా, ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నవారికి, మత్స్యకారులకు, చేనేతలకు, అగ్రిగోల్డ్‌ బాధితులకు, లా నేస్తం కింద దాదాపు 15వేల కోట్లకుపైనే నగదును బదిలీ ద్వారా ఇచ్చామని తెలిపారు. అమ్మఒడి కింద రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నామన్నారు.

వైఎస్‌ఆర్‌ నవోదయం కింద ఖాతాల పునర్‌ వ్యవస్థీకరణపైనా దృష్టి పెట్టాలని బ్యాంకర్లను జగన్ కోరారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గుర్తింపు కార్డులతో రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు.

మహిళలు, రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వడ్డీ చెల్లింపునకు ప్రభుత్వం బ్యాంకర్లకు భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, దీనికి బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు.