AP CM Jagan : టెన్త్ పరీక్షలు రద్దు చేయడం సులువే…కానీ విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నా

పరీక్షలు రద్దు చేయడం చాలా తేలిక, నిర్వహించడమే కష్టమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పరీక్షల నిర్వాహణకు మొగ్గు చూపుతున్నామని తెలిపారు.

AP CM Jagan : టెన్త్ పరీక్షలు రద్దు చేయడం సులువే…కానీ విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నా

Ap Cm Jagan

CM Jagan responds on SSC examinations : పరీక్షలు రద్దు చేయడం చాలా తేలిక, నిర్వహించడమే కష్టమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పరీక్షల నిర్వాహణకు మొగ్గు చూపుతున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, పరీక్షలు రద్దు చేయాలనే వారు ఓసారి ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. పబ్లిక్‌ పరీక్షల నిర్వాహణపై కేంద్రం పూర్తిగా చేతులెత్తేసిందని.. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం అమలు చేస్తున్నాయనని జగన్‌ అన్నారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి, కొన్ని చోట్ల జరుగుతున్నాయని తెలిపారు.

టెన్త్‌, ఇంటర్‌ మార్కుల సర్టిఫికేట్లపైనే విద్యార్థుల భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు. మంచి కాలేజీలో సీటు రావాలంటే మార్కులు ఉన్న సర్టిఫికేట్‌కే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రేపు ఏదైనా మంచి కాలేజీలో సీటు పొందాలంటే పరీక్షలు రాసి మార్కులు వచ్చిన విద్యార్థికి ప్రాధాన్యత ఉంటుందా ? లేక కేవలం పాస్‌ అనే సర్టిఫికేట్ ఉన్న విద్యార్థికి ప్రాధాన్యత ఉంటుందా అనే విషయం ఆలోచించుకోవాలని తల్లిదండ్రులను కోరారు.

జగనన్న వసతి దీవెన పథకాన్ని బుధవారం (ఏప్రిల్ 28, 2021) సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వర్చువల్ ద్వారా ప్రారంభించారు. రూ.1,048.94 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ మొత్తం నిధులు నేరుగా తల్లుల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు వసతి దీవెన పథకం కింద ఏడాదికి రూ.20వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివే వారికి ఏడాదికి రూ.20వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యమైందన్నారు. నాడు – నేడు కింద అంగన్‌వాడీ భవనాల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్ సహా కనీస వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో తొలివిడత ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించామని తెలిపారు.

జూలైలో రెండో విడత.. డిసెంబర్‌లో మూడో విడత..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత ఫీజులు చెల్లిస్తామని చెప్పారు. ఇవాళ తొలివిడత వసతి దీవెన నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్‌లో రెండో విడత నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.