నాకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు చేరాలి : సీఎం జగన్ 

  • Published By: srihari ,Published On : May 25, 2020 / 10:49 AM IST
నాకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు చేరాలి : సీఎం జగన్ 

రాష్ట్రంలో 58.61 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు దాకా వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చే వారని..ఇప్పుడు పెన్షన్ రూ.2,250 ఇస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనపై ఇవాళ్టి నుంచి జగన్ మేదోమథనం నిర్వహిస్తున్నారు. ఇవాళ పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ బకాయిలను తీరుస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించాలన్నారు. ప్రతి అధికారి వద్ద మేనిఫెస్టో ఉండాలి..అన్ని నెరవేర్చాలన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నామని తెలిపారు. ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. 

రూ.10 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నామని చెప్పారు. నాడు…నేడు ద్వారా 15, 700 స్కూళ్ల రూపురేఖలు మారబోతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల బిల్లులు కూడా చెల్లించామని తెలిపారు. మే 18 వరకు ఆరోగ్యశ్రీలో ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించేశామని తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. 
వ్యవస్థలో మార్పులు వస్తే తప్ప ప్రజలకు తోడుగా ఉండలేమన్నారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థ అన్నారు. వివక్ష, అవినీతికి తావులేకుండా ఈ వ్యవస్థ ఉండాలన్నారు. 

నాకు ఓటు వేయని వారికి కూడా పథకాలు చేరాలన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరుగకుండా చూస్తున్నామని చెప్పారు. పథకానికి అర్హతలేమిటి..ఎలా నమోదు చేసుకోవాలో కూడా సూచిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో పది నుంచి పన్నెండు ఉద్యోగాలు సృష్టించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 82.5 శాతం ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఏడాది లోపు దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 

వాలంటీర్ల ద్వారా అర్హులందరికీ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిజరగడం సంతృప్తినిచ్చిందన్నారు. బియ్యం పంపిణీని గడప గడపకు చేరుస్తున్నామని తెలిపారు. గతంలో పెన్షన్ కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఆ పరిస్థితి పోయి నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. 

Read: పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు : సీఎం జగన్