COVID–19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష, టెస్టులు పెంచాలని అధికారులకు ఆదేశాలు

  • Published By: chvmurthy ,Published On : April 23, 2020 / 10:40 AM IST
COVID–19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష, టెస్టులు పెంచాలని అధికారులకు ఆదేశాలు

జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల టెస్టింగులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు టెస్టుల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ మీటింగ్ లో సీఎం అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన అధికారులు.. ‘బుధవారం ఒక్కరోజే 6వేల 520 RTPCR టెస్టులు చేశాం. ఇప్పటివరకూ మొత్తం 48వేల 34 పరీక్షలు పూర్తయ్యాయి. ఒక మిలియన్‌కు 961 టెస్టులతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది రాష్ట్రం. రాబోయే రోజుల్లో మరిన్ని పరీక్షలతో మెరుగుపడతాం’

‘కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌కు ICMR అనుమతి వచ్చింది. ప్రోటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌తో పరీక్షలు జరుగుతాయి. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌తో 14వేల 423 పరీక్షలు నిర్వహించాం. వాటిలో రెడ్‌జోన్లలోనే 11వేల 543 టెస్టులు చేశాం. మొత్తం పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌లు ర్యాండమ్‌ కిట్లలో వచ్చాయి. వీటి నిర్ధారణకోసం పీసీఆర్‌ టెస్టులకు పంపుతాం. కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుంది. 

అంతేకాకుండా టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సలహా తీసుకున్న వారికి మందులు కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. సింగపూర్,  చైనాల్లో మరోసారి వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైంది. అందుకే మనం జాగ్రత్తలు ముమ్మరం చేశామని అధికారులు అంటున్నారు. 

జులైలో మరో సర్వే

సీఎం జగన్ జులై నెలలో మరో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలి. ఎమర్జెన్సీ కేసులకు, డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలి. 

ప్లాన్ చేసిన కొత్త మెడికల్‌ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలి. ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్‌ చేయండి. గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా పంటలు పరిస్థితులు,  ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించవచ్చు. రూ.100లకు వివిధ రకాల పండ్లు… ఇవ్వటాన్ని కొనసాగించాలి. శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలి. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు.