సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలి – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 06:15 AM IST
సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలి – సీఎం జగన్

CM Jagan review on irrigation water projects : ఏపీలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్‌ -2 పనులను సకాలంలో పూర్తి చేసేందుకు సీఎం జగన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మే నాటికి పోలవరానికి సంబంధించి అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు కంప్లీట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.



పోలవరం ప్రాజెక్టు : – 
ఇందులో పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్, స్పిల్‌ ఛానెల్‌ పనులు మే నాటికి పూర్తి చేయాలని, అంతకు ముందే కాఫర్‌ డ్యాం పనులు కూడా కంప్లీట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.



సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు : – 
అంతేకాకుండా పోలవరం నుంచి విశాఖపట్నం తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్‌ లైన్‌ ఏర్పాటు కోసం కూడా ఆలోచన చేయాలని నిర్దేశించారు. ఎలాంటి పంపింగ్‌ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలన్నారు. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపైనా సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండు టన్నెల్స్‌ ద్వారా నీళ్లిచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.



సీఎం జగన్ టార్గెట్ : – 
దీంతో వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని జగన్‌ ఆదేశించారు. ఇక అవుకు టన్నెల్‌-2 ఫాల్ట్‌ జోన్‌లో మిగిలిన 137 మీటర్ల సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం టార్గెట్‌ నిర్దేశించారు. మూడో టన్నెల్‌ టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వడంతో… పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జగన్‌ ఆదేశించారు.



రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు : – 
రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఉద్దేశించిన ఎస్పీవీ రిజిస్ట్రేషన్‌ పూర్తైందని అధికారులు సీఎంకు వివరించారు. దానికి సంబంధించిన లోగోను చూపారు. ఇక చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరులో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీటిని నింపి.. రైతులకు నీరు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. గండికోటలో 20 టీఎంసీల వరకు నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు.